అమర్ నాథ్ యాత్రకు ఏర్పాట్లు పూర్తి

వార్షిక అమర్ నాథ్ యాత్రకు ఏర్పాట్లు పూర్తయినట్లేనని భావించొచ్చు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశామని అధికార యంత్రాంగం చెబుతోంది. యాత్రికులను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చేందుకు అసవరమైన మౌలిక వసతులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.

ఈ సారి 3 లక్షల మంది

అమర్ నాథ్ యత్ర జూలై 1న ప్రారంభమవుతుంది. 62 రోజుల పాటు ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. యాత్ర చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక రోజులు సాగుతుందని అధికార వర్గాలు ప్రకటించాయి. ఇప్పటి వరకు మూడు లక్షల మంది యాత్రికులు రిజిష్టర్ చేసుకున్నారని, ఇంకా చాలా మంది ఆ ప్రయత్నంలో ఉన్నారని శ్రీ అమర్ నాథ్ ఆలయ బోర్డు సీఈఓ మన్దీప్ భండారీ ప్రకటించారు. గతేడాది కంటే ఈ సారి పది నుంచి పదిహేను శాతం మంది ఎక్కువ యాత్రికులు ఉంటారని అంచనా వేస్తున్నారు.

పర్వత ప్రాంత సహాయ బృందాలు సిద్ధం

గతేడాది పిడుగులు, భారీ వర్షాలకు 16 మంది చనిపోవడంతో ఈ సారి తక్షణ సహాయ చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 30 మౌంటేయిన్ రెస్క్యూ టీమ్స్ ను నియించారు. జమ్మూకశ్మీర్ పోలీసులు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అమర్ నాథ్ గృహ దగ్గర భద్రత కోసం ఇండో టిబెటెన్ బోర్డర్ పోలీసులను నియమించారు. ఇతర ప్రాంతాల్లో భద్రత సీఆర్పీఎఫ్ చేతిలో ఉంటుంది. కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందన్న అనుమానాల నడుమ యాత్రికులందరికీ ఉచితంగా హెల్మెట్లు అందిస్తారు.

ప్రతీ చోట లెక్కింపే..

యాత్రికులకు ఇబ్బందిలేకుండా ఉండేందుకు, వారు ఎక్కడా తప్పిపోకుండా చూసేందుకు జమ్మూకశ్మీర్ యంత్రాంగం అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఆటోమెటిక్ కౌంటింగ్ సిస్టమ్ ద్వారా యాత్రికులను లెక్కిస్తూ అందరినీ గమ్యస్థానానికి చేర్చుతారు. దర్శనం తర్వాత తిరిగి వెళ్లేంత వరకు ప్రతీ ఒక్కరినీ కనిపెట్టి ఉండే అవకాశం వస్తుంది. బాల్టాల్ నుంచి వెళ్లే 14 కిలోమీటర్లు, పహల్గాం నుంచి 32 కిలోమీటర్ల మార్గంలో జనాన్ని చూస్తూ ఉండే బాధ్యతను అదనంగా మూడు ఏజెన్సీలకు అప్పగించారు. యాత్రికులకు అవసరమైతే వైద్యం చేసేందుకు వీలుగా 1,700 మంది వైద్యులు, పారా మిలటరీ సిబ్బందిని నియమించారు. ఐదు వేల టాయ్ లెట్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శుభ్ర పరిచేందుకు 4 వేల మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. దాదాపు రెండున్నర కిలోమీటర్ల ప్రాంతంలో కొండ చరయలు విరిగిపడే ప్రమాదం ఉందని గుర్తించారు. పవిత్ర గుహ దగ్గర భద్రతా సిబ్బంది మినహా ఎవరూ ఉండేందుకు అవకాశం ఇవ్వరు. మిగతా వారికి మార్గమధ్యంలో బస చేసే ఏర్పాట్లున్నాయి. అమర్ నాథ్ మార్గంలో 70 వేల మంది బస చేసే వీలుంటుంది.