ఆషాఢమాసంలో తప్పనిసరిగా చేయాల్సిన పనులివి

చిరుజల్లుల స్వాగతంతో ఆషాఢమాసం ప్రవేశిస్తుంది. ఆ ఆషాఢమాసం రావడంతో పాటూ తనతో కొన్ని ఆచారాలనూ తీసుకొస్తుంది. అవన్నీ చాదస్తం అని కొట్టిపడేయడానికి లేదు. ఎందుకంటే అవన్నీ ఆధ్యాత్మికపరంగా చెప్పినవి కాదు ఆరోగ్యం కోసం సూచించినవి. అప్పట్లో ఆరోగ్యం కోసం అన క్లాసులిస్తే ఎవ్వరూ పట్టించుకోరు కాబట్టి ఆధ్యాత్మికతకు ముడిపెట్టేవారు. ఆషాఢమాసంలో పాటించే ప్రతి ఆచారం వెనుకూ ఓ సహేతుకమైన కారణం ఉంటుంది. అలాంటి కొన్ని పద్ధతులను ఇక్కడ సూచిస్తున్నాం.. పాటిస్తే మంచిదే…

దానాలు
ఆషాఢం మాసం దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయం అంటే పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెబుతుంటారు. కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని సూచిస్తారు పండితులు. ముఖ్యంగా గొడుకు, చెప్పులు దానం చేస్తే మంచిదంటారు. వానాకాలంలో ఈ రెండింటి అవసరం చాలా ఉంది కదా అది కూడా ఓ కారణం.

సముద్రస్నానాలు
ఆకామావై పేరుతో సముద్రస్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢమాసాన్ని పేర్కొంటారు. ఆషాఢం వరకూ సముద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది. వర్షరుతువుతో పాటుగా అందులోకి కొత్త నీరు చేరుతుంది. ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోకి చేరే సమయంలో మొక్కలు, ఖనిజాలలో ఉన్న ఔషధగుణాలని తనతో పాటుగా తీసుకువస్తుంది. అలాంటి సమయంలో సముద్రస్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది.

గోరింటాకు
ఆషాఢంలో వర్షాలు ఊపందుకుంటాయి. తరచూ వర్షపు నీటిలో నానుతూ ఉంటారు. పొలం పనులు ఊపందుకునే సమయం కావడంతో అంతా ఆ పనుల్లో బిజీగా ఉంటారు. దాంతో గోళ్ల సందుల్లో నీరు చేరి చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గోళ్లు కూడా పెళుసుబారిపోతాయి. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతుంది గోరింటాకు. ఇంకా కఫ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయి.అందుకే ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలని సూచిస్తారు.

పేలాల పిండి
ఆషాఢంలో వచ్చే గాలి, నీటి మార్పులతో కఫసంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తిపై కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే పేలాలు కఫానని తగ్గిస్తాయి, జీర్ణశక్తికి మెరుగుపరుస్తాయి. వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లం, యాలుకలు శరీరంలో వేడిని పెంచుతాయి. అందుకే ఆషాఢంలో వచ్చే తొలిఏకాదశి రోజున తప్పకుండా పేలాలపిండి తినాలని చెబుతూ ఉంటారు.

మునగాకు
మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం స్పష్టంగా చెప్పింది. లేత మునగాకు తింటే కంటిసమస్యలన్నీ తీరిపోతాయని ప్రకృతి వైద్యులు చెబుతారు. కానీ మునగాకు చేదుగా ఉంటుంది, పైగా విపరీతమైన వేడి..అందుకే మునగాకు తినేందుకు ఇదే అనువైన కాలం. పోషకాలు పుష్కలంగా ఉండే మునగాకు మోకాళ్ల నొప్పులు తగ్గించేందుకు సహాయ పడుతుంది

చాదస్తం, పెద్దోళ్లు అలాగే చెబుతారులే అనుకునేవారికి వాటికి పాటించడం వెనుకున్న కారణం తెలియకపోవచ్చు. అవన్నీ వాళ్లకోసమో, సంప్రదాయాన్ని కొనసాగించాలనే తాపత్రయమో కాదు తర్వాతి తరాలు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతో దేవుడికి ముడిపెట్టి తప్పనిసరిగా ఇవన్నీ పాటించాలని చెబుతారు

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.