మోదీపై దూడుకు పెంచేందుకు విపక్షాలు పట్నాలో నిర్వహించిన సమావేశం సాధించిందీ శూన్యమని తేలిపోయింది. జూలైలో మళ్లీ సమావేశమవ్వాలన్న నిర్ణయం మినహా అక్కడ పెద్దగా చర్చించిందేమీ లేదని ఒకటొకటిగా అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. మీటింగులో మాట్లాడుకున్న దాని కంటే తిట్టుకున్నది ఎక్కవగా ఉన్నట్లు తాజాగా వినిపిస్తున్న మాట. నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్ లో కొంత ఘర్షణాత్మక వాతావరణం కూడా కనిపించింది.
కాంగ్రెస్, సీపీఎంపై మమత అసంతృప్తి
ఇన్ని రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నోరు విప్పారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కాషాయ పార్టీకి కొమ్ము కాస్తూ బీ టీమ్ గా మారాయని మమత తాజాగా ఆరోపించారు. మహాకూటమి ఏర్పాటుకు తాను అహరహం కృషి చేస్తున్నానని, ఆ రెండు పార్టీలు మాత్రం అడ్డుతగులుతున్నాయని మమత అంటున్నారు. బెంగాల్ లో బీజేపీతో కలిసిపోయేందుకు కాంగ్రెస్, సీపీఎం సిద్ధమయ్యాయని మమత వాదన. త్వరలోనే ఆ అపవిత్ర కలయికకు చరమగీతం పాడతానని మమత హెచ్చరించారు. వాళ్ల అంతు చూస్తానన్న రేంజ్ లో ఆమె మాట్లాడుతున్నారు..
ముందే అగిసిన ఆప్ …
ఢిల్లీ ఆర్జినెన్స్ విషయంతో ఆమ్ ఆద్మీ పార్టీ ముందే అలిగింది. పట్నాలో 23న జరిగిన సమావేశానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాజరు కాలేదు. తమకు బదులుగా ప్రతినిధిని పంపి ఊరుకున్నారు.. బీజేపీకి అనుకూలంగా కేంద్రం ఆర్ఢినెన్స్ తీసుకొస్తే దాన్ని ఖండించేందుకు కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని కేజ్రీవాల్ ఆరోపి్ంచారు. కాంగ్రెస్ దిగి వచ్చే వరకు ఆ పార్టీ నేతలతో వేదిక పంచుకునే ప్రసక్తిలేదని సమావేశం తర్వాత ఆయన సంకేతమిచ్చారు.
సీపీఎంపై రాహుల్ ఫైర్
కేరళలో కాంగ్రెస్, సీపీఎం మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా సీపీఎం నేతలపై ఆరోపణలు సంధించారు. కేరళలోని సీపీఎం ప్రభుత్వం బెదిరించి, భయపెట్టి ఇతర పార్టీలను దారికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని రాహుల్ అంటున్నారు. అలాంటి అవకాశాలు ఇవ్వదలచుకోలేదని తేల్చేశారు. చిన్న కేసులో కేరళ పీసీసీ అధ్యక్షుడు కే. సుధాకరన్ ను అరెస్టు చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం చెప్పారు. దీనిపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది..
రాహుల్ పెళ్లిపై చర్చించారు – ఉపేంద్ర కుష్వాహా
విపక్షాల భేటీపై రాష్ట్రీయ లోక్ జనతా దళ్ (ఆర్ఎల్జేడీ) నాయకుడు ఉపేంద్ర కుష్వాహా సెటైర్లు వేశారు. రోజంతా జరిగిన సమావేశంలో చిల్లర మాటలు మాట్లాడారని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ గెడ్డం, ఆయన పెళ్లి ఎవ్పుడనేది చర్చించి వెళ్లిపోయారని ఆ పని కూడా సక్రమంగా చేయలేకపోయారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మునిగిపోయే నావ అయిన జేడీయూను ఒడ్డుకు నెట్టలేక నానా తంటాలు పడుతున్న బిహార్ సీఎం నితీష్ కుమార్.. విపక్షాల ఐక్యతను ఎలా సాధించగలరని కుష్వాహా ప్రశ్నిస్తున్నారు. ముందు ఆయన సొంత పార్టీని గాడిలో పెట్టుకోవాలన్నారు.