అనంతపురం టీడీపీలో గ్రూపుల గోల – ఇక ఆ పార్టీని ఎవరూ కాపాడలేరా ?

తెలుగుదేశం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అయింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. ఆ విషయం బ స్సు యాత్రలో మరోసారి స్పష్టమయింది. వచ్చే ఎన్నికల కోసం బస్సు యాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు చేపట్టిన ఈ యాత్ర గ్రూపు తగాదాలకు కేంద్రంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతల భవిష్యత్తుకు ఆరాటంలాగా మారి ఆధిపత్యపు యాత్రగా సాగుతోంది. ఆ పార్టీ నేతల మధ్యనున్న విభేదాలు ప్రతి చోటా బయటపడుతూ వస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఈ యాత్రను సైతం రద్దు చేసుకునే పరిస్థితి నెలకొంది.

ప్రచార యాత్ర బస్సు ముందే కొట్టుకున్న తమ్ముళ్లు

ఈనెల 23వ తేదీన కదిరిలో బస్సుయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషాకు పిలుపు లేకపోవడంతో ఆయన ఈ యాత్రకు దూరంగా ఉన్నారు. ఇక పుట్టపర్తిలో సాధారణంగానే జరిగినప్పటికీ పెనుకొండకు వచ్చే సరికి నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. నేతలు గ్రూపులుగా విడిపోయి బాహాబాహికి దిగారు. సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులుగా బికె.పార్థసారధి, మరో నాయకురాలు సబితమ్మ మధ్య గ్రూపు విభేదాలున్నాయి. ఈ గ్రూపులకు నాయకుల ప్లెక్సీలుండటం కూడా తగాదాకు కారణమైంది. బస్సయాత్ర సందర్భంగా ఒకరినొకరు బాహాటంగానే కొట్టుకున్నారు. జిల్లా అధ్యక్షుడి నియోజకవర్గంలోనే ఇది జరగింది.

బలప్రదర్శన వేదికలుగా మేనిఫెస్టో ప్రచార వ్యవహారం

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంగళవారం యాత్ర జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఉత్కంఠత నెలకొంది. అక్కడ ముందు నుంచి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతీ చౌదరి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వర నాయుడు రెండు గ్రూపుల మధ్య విభేదాలున్నాయి. ఈ గ్రూపుల మధ్య అనేక మార్లు బాహాటంగానే ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బస్సు యాత్రలోనూ రెండు గ్రూపుల నాయకులు బల ప్రదర్శనలకు దిగి తమ పట్టును చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. మడకశిరలోనూ మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిల మధ్య విభేదాలున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ యాత్రనే లేకుండా చేశారు.

గొడవలు ఉంటాయని పలు నియోజకవర్గాల్లో యాత్రలు సైతం రద్దు

శింగనమల నియోజకవర్గ ఇన్‌ఛార్జి లేకుండా టూమెన్‌ కమిటీ పేరుతోనే నడుస్తోంది. ఈ టూమెన్‌, ఇన్‌ఛార్జీ బండారు శ్రావణి గ్రూపుల మధ్య పొసగడంలేదు. జిల్లాల్లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం చేకూరింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీకి ఘోర పరాజయమైంది. ఇంత జరిగినా పార్టీ నేతల్లో కనువిప్పు కలుగలేదు. నాయకుల మధ్య సమన్వయం ఇప్పటికీ కుదరలేదు. ఎవరికీ వారుగా నేతలు ఆధిపత్యం కోసం ఆరాటపడుతూనే ఉన్నారు. నేతల మధ్య తగదాల ప్రభావం క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నాయకులను సైతం గందరగోళంలో పడేస్తోంది. దీంతో అనంతపురం టీడీపీ కోలుకుంటుందా లేదా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.