ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మారుస్తాంటూ కొన్ని మీడియాలో గత ఏడాదిన్నరగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆయన పై ఆ మీడియాలకు ఎందుకు అంత కోపం ఉందో కానీ… బీజేపీ విషయాల్లో ఇతర వార్తలకు ఇవ్వని ప్రాధాన్యం ఇస్తూంటారు. అదీ కూడా.. ఢిల్లీ వర్గాలు అనుకుంటున్నాయంటూ ప్రచారం చేస్తున్నాయని చెబుతూంటారు. ఇలా ప్రచారం చేసే వాటిలో రెండు ప్రాంతీయ పార్టీలకు చెందిన మీడియి, సోషల్ మీడియాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సోము వీర్రాజు ఉంటే వారికి ఇబ్బందిలా ఉంది అందుకే ఇలా ప్రచారం చేస్తున్నారన్న సెటైర్లు బీజేపీలో వినిపిస్తున్నాయి.
సోము వీర్రాజు నేతృత్వంలోనే ఎన్నికలకని పలుమార్లు ప్రకటించిన హైకమాండ్
ఆంధ్రప్రదేశ్ వచ్చే ఎన్నికలను బీజేపీ సోము వీర్రాజు నేతృత్వంలోనే ఎదుర్కొంటామని బీజేపీ హైకమాండ్ ఇప్పటికే చాలా సార్లు ప్రకటించింది. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ , కో ఇంచార్జ్ తో పాటు… పలుమార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పార్టీ శ్రేణులకు ఇదే సంకేతం ఇచ్చారు. అందుకే ఏపీ బీజేపీ ఏకతాటిపైన పోరాటం చేస్తోంది. ఎన్నికలకు సిద్ధమవుతోంది. రెండు ప్రాంతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు ధీటుగా ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతున్న సమయంలో సోము వీర్రాజును తప్పిస్తారంటూ ఓ ప్రచారాన్ని కొన్ని మీడియాలు మళ్లీ ప్రారంభించాయి.
సోము వీర్రాజు నేతృత్వంలో చురుకుగా బీజేపీ కార్యకలాపాలు !
గతంతో పోలిస్తే… ఏపీ బీజేపీ కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. దాదాపుగా ప్రతీ రోజూ ఏదో ఓ చోట సభ పెడుతున్నారు. పార్టీ ముఖ్యనేతలంతా ఏదో ఓ కార్యక్రమంతో ప్రజల్లో ఉంటున్నారు. అటు హైకమాండ్ నిర్దేశించిన కార్యక్రమాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం … తీరిక లేకుండా బీజేపీ నేతలు ఉన్నారు. గత ఏడాదిన్నరగా ఈ పోరాటం సాగుతోంది. పకడ్బందీగా నిర్వహించి ప్రతీ మూలకువెళ్లి నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల విషయంలో.. హైకమాండ్ కూడా అభినందనలు తెలిపింది. తర్వాత ప్రజా చార్జిషీట్లను కూడా అదే స్ఫూర్తిోత నిర్వహించారు. ఇప్పుడు ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పరిపాలనపైనా విస్తృతంగా కార్యకలాపాలు చేపడుతున్నారు.
రెండు పార్టీలూ విమర్శిస్తున్నాయంటే సోము వీర్రాజు సక్సెస్ అయినట్లే !
ఏపీలో రెండు ప్రధాన పార్టీలు బీజేపీని టార్గెట్ చేసుకుంటున్నాయి. అంటే రెండు పార్టీలకు బీజేపీ ఎంత కొరకరాని కొయ్యలాగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చని బీజేపీ నేతలంటున్నారు. ఇప్పటి వరకూ బీజేపీని ఏదో ఓ పార్టీకి అనుబంధంగా చూపేందుకు ప్రయత్నించారు. కానీ ఇప్పుడా పరస్థితి లేకుండా పోయింది. బీజేపీ సొంతంగా ఎదుగుతోందనే.. రెండు పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇది సోము వీర్రాజు వల్లే సాధ్యమయిందని.. హైకమాండ్ నమ్ముతోందని వచ్చే ఎన్నికలు ఆయన నేతృత్వంలోనే జరుగుతాయని తేల్చిందని అంటున్నారు. బయట జరిగే ప్రచారాలన్నీ ఈ పార్టీల కుట్రలో భాగమేనని అనుమానిస్తున్నారు.