వైసీపీ కృష్ణా జిల్లా కీలక నేతల్లో ఒకరైన పార్థసారధి ఇప్పుడు పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా కాలం గడుపుతున్నారు. ఇటీవల ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ వైసీపీ ముఖ్యనేతలెవరూ పెద్దగా పట్టించుకోలేదు. వైఎస్ హయాంలో మంత్రిగా చేసిన ఆయన… తర్వాత వైసీపీ కోసం కష్టపడినా ప్రయోజనం లేదని అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి రాకపోవడంతో… సైలెంట్ అయ్యారు.
మంత్రి పదవి రేసులో ఉన్నారన్న ప్రచారంతో అమరావతికీ వ్యతిరేకంగా ప్రకటనలు
పార్థసారధి సీనియర్. ఇంకా చెప్పాలంటే బీసీ. ఈ సమీకరణాల ప్రకారం ఆయనకు వెంటనే మంత్రి పదవి రావాలి. కానీ జగన్ ఆయనను పరిగణనలోకి తీసుకోలేదు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో చాన్సిస్తామని చెప్పారు. అలా చాన్స్ వస్తుందని అమరావతి కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. సొంత ప్రాంతంపై నిందలు కూడా వేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో పార్థసారధి ఇటీవల సైలెంట్ గా ఉన్నారు. హైకమాండ్ ప్రెస్ మీట్ పెట్టి .. విపక్షాలను విమర్శించాలని కోరినా పట్టించుకోవడం లేదు. దీంతో ఆయన రాజకీయ పయనం ఎటన్నదానిపై చర్చ ప్రారంభమయిదంి.
పార్థసారధి దారెటు ?
కొలుసు పార్థసారధి కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత. ఆయన తండ్రి కూడా.. రాజకీయ ఉద్దండునిగా పేరు తెచ్చుకున్నారు. తండ్రి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన పార్థసారధి.. టీడీపీకి పెట్టని కోట లాంటి కృష్ణా జిల్లా నుంచి బలమైన నేతగా ఎదిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా కూడా చేశారు. కృష్ణా జిల్లా నుంచి వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. అదే సమయంలో.. బీసీ వర్గాల్లో బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన నేత. దాంతో… అటు సీనియార్టీ.. ఇటు సామాజికవర్గం… అన్నీ కలసి వస్తాయని మంత్రి పదవి గ్యారంటీ అని ఆశ పెట్టుకున్నారు. కానీ.. మొదట ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌కు పదవులు దక్కాయి. వెల్లంపల్లి శ్రీనివాస్.. ఎన్నికలకు కొన్ని నెలల ముందే.. వైసీపీలో చేరారు. టిక్కెట్ తెచ్చుకుని మంత్రి అయిపోయారు. తాను గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఆర్థికంగా నష్టపోయినా.. ఐదేళ్ల పాటు పార్టీని అంటి పెట్టుకుని పని చేసినా.. తనకు గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తిలో చేరిపోయారు.
వచ్చే ఎన్నికల్లో వేరే దారి చూసుకునే పనిలో ఉన్నారా ?
ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన పద్దెనిమిది మంది జాబితాలో పార్థసారధి పేరు కూడా ఉందని చెబుతున్నారు. అయితే పార్థసారధి మాత్రం ఇప్పటి వరకూ పార్టీకి వ్యతిరేకంగా నేరుగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. వైసీపీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనడం లేదు. అనారోగ్యం కారణంగా చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి ఏదో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నప్రచారం మాత్రం జరుగుతోంది.