గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పోటీకి వైసీపీలో నేతలు ఒకరి తర్వాత ఒకరు రెడీ అవుతున్నారు. ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు ఈ సారి టిక్కెట్ లేదని చెబుతున్నారు. అయితే ఉమ్మారెడ్డి అల్లుడిగా తనకు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని ఆయన ఒత్తిడి చెస్తున్నారు. మరో వైపు క్రికెటర్ అంబటి రాయుడు రేసులోకి వచ్చారు. ఇప్పుడు కొత్తగా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి కన్ను కూడా పొన్నూరు నియోజకవర్గంపై పడిందని చెబుతున్నారు.
సోషల్ మీడియా ఇంచార్జ్ గా ఉన్న భార్గవ్ రెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పొన్నూరు నుంచి పోటీ చేయాలనే కోరికతో ఉన్నట్టు పార్టీ వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తున్నారు. ఆయనకు ఎన్నికల్లో పోటీచేయాలనే ఆసక్తి ఉందని సన్నిహితులు చెబుతున్నారు. సజ్జల కుటుంబానికి కడప జిల్లా అయినా అక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు. సజ్జల రామకృష్ణారెడ్డిపేరు కడప లోక్ సభ స్థానానికి వినిపిస్తోంది. అయితే ఆయనకు రాజ్యసభ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
తన అల్లుడికే ఇవ్వాలని ఉమ్మారెడ్డి పట్టుబట్టే అవకాశం
గత ఎన్నికల్లో వైసీపీ తరపున చివరి క్షణంలో… ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్యకు టిక్కెట్ ఇచ్చారు జగన్. ఆయనకు గతంలో గుంటూరు వెస్ట్.. ఆ తర్వాత గుంటూరు పార్లమెంట్ బాధ్యతలు ఇచ్చారు. చివరికి పొన్నూరు టిక్కెట్ ఇచ్చారు. నియోజకవర్గంలో 33వేల వరకూ కాపు సామాజికవర్గం ఓట్లు ఉన్నాయి. ఈ కారణంగా కాపులకే సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే కాపులకే ఇవ్వాల్సి వస్తే అంబటి రాయుడుకు చాన్స్ ఇస్తాం కానీ.. రోశయ్యకు మరో చాన్స్ లేదని చెబుతున్నారు. ఆయనపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని చెబుతున్నారు.
పొన్నూరే వైసీపీ నేతలకు ఎందుకు గురి ?
గుంటూరులోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు గట్టిగా ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో వేలు పెట్టనివ్వరు. పొన్నూరులో మాత్రమే రోశయ్య బలహీనంగా కనిపిస్తున్నారు. ఆయనకు మళ్లీ టిక్కెట్ ఇచ్చే చాన్స్ లేదని.. పైగా అక్కడ బీసీలకు కూడా ఇవ్వరని పూర్తిగా .. ఓసీ వర్గానికి క్లారిటీ ఉండటంతో అందరూ… ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. నిజంగా సజ్జల భార్గవరెడ్డి పోటీ చేయాలనుకుంటే… ఆయనకు జగన్ టిక్కెట్ ఇస్తారని అంటున్నారు. ఎంతో నమ్మకం ఉంటే తప్ప .. పొన్నూరులో పోటీ చేయరని.. ఖచ్చితంగా గెలుస్తారన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే పోటీకి సిద్ధమవుతున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి.