“మేకిన్ ఇండియా – మేక్ ఫర్ వరల్డ్” మోదీ కొత్త నినాదం

ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. భారత్ మాతా కీ జై అంటూ ప్రవాస భారతీయులు నినదిస్తే, మోదీ మాట వినేందుకు ప్రతీ అమెరికన్ ఎదురుచూశారు. ఆయన ప్రతీ ప్రసంగమూ, ప్రతీ కదలిక అమెరికన్ జనం మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. గత తొమ్మిది సంవత్సరాలుగా మోదీ నేతృత్వంలోని భారత్ అభివృద్ధి వేగంగా పరుగులు తీస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని అమెరికన్లు భావిస్తున్నారు.

ఇదో కొత్త ప్రయాణం

భారత దేశ ప్రాథమ్యాలను ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టారు. అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ సుసంపన్నమైన ప్రపంచాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు ఈ దిశగానే “మేకిన్ ఇండియా – మేక్ ఫర్ వరల్డ్” అనే నినాదాన్ని భారతీయ అమెరిన్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రస్తావించారు. వాషింగ్టన్లోని రోనాల్డ్ రీగన్ సెంటర్ .. భారత్ మాతా కీ జై, వందే మాతరం నినాదాలతో మారుమోగిపోతుండగా.. ప్రవాసులకు ఆయన ఓ తీపి కబురు కూడా చెప్పారు. హెచ్1బీ వీసా రిన్యూవల్ చేసుకునేందుకు భారతీయులు ఇకపై అమెరికా బయట ప్రయాణించి రావాల్సిన అవసరం లేదని ఆయన ప్రకటించారు. ఇదీ అమెరికా పర్యటనలో అక్కడి భారతీయులకు మోదీ చేసిన గొప్ప సాయంగా భావించాల్సి ఉంటుంది.

అవకాశాల స్వర్గధామం

పెట్టుబడులకు భారత్ సహేతుకమైన ప్రదేశమని, అవకాశాల గని అని మోదీ ప్రకటించారు.విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారంతా భారత్ రావాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా పారిశ్రామికవేత్తులు, వ్యాపారులతో పాటు స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రవాసులు.. దేశంలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. భారత్ తన అభివృద్ధి ప్రయాణంలో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని వెల్లడించారు. పెట్టుబడులకు అనువుగా ఉండేందుకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని ఆ దిశగా రూ.10 లక్షల కోట్లు వ్యయం చేస్తున్నామని చెప్పారు. దేశంలో పేదరికం తగ్గి కొత్త మధ్య తరగతి పుట్టుకొస్తోందన్నారు.

కృత్రిమ మేథ, సెమీకండక్టర్ల ఉత్పత్తే లక్ష్యం

మోదీ, బైడెన్ ఇద్దరూ టెక్నాలజీని ప్రత్యేకంగా ప్రస్తావించారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెండ్ల పాల్గొన్న సదస్సులో ఇరు దేశాల మధ్య సహకారంలో కొత్తదనాన్ని ఆకాంక్షిస్తున్నట్లుు మోదీ ప్రకటించారు. సరికొత్త టెక్నాలజీ యుగంలో ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారతీయుల సమర్థతను ఎప్పుడో గుర్తించామని అమెరికా ప్రకటించింది. గత యాభై ఏళ్లలో సాధించలేని ప్రగతిని వచ్చే పదేళ్లలో చేసి చూపిస్తామని వెల్లడించింది. భారత్ లో అమెరికా కంపెనీల పెట్టుబడులను గణనీయంగా పెంచేందుకు నిర్ణయించారు. మైక్రాన్ టెక్నాలజీ సంస్థ రూ. 20 వేల కోట్లతో సెమీ కండక్టర్ల అసెంబ్లీ, టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ల్యామ్ రీసెర్ట్ సెంటర్ తరపున 60 వేల ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. నాసా, ఇస్రో కలిసి అంతర్జాతీయ స్పెస్ స్టేషన్ కు ఒక వ్యోమనౌకను పంపుతారు. మొత్తానికి మోదీ పర్యటన ఇరు దేశాల సహకారానికి కొత్త ఊపునిచ్చింది. మోదీ నాయకత్వం పట్ల జనంలో విశ్వాసాన్ని పెంచింది.