నగరాల్లో రోడ్డెక్కాలంటే గంటలతరబడి వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. భయంకరమైన ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకునే వాహనదారుడే ఉండడు. ఇక నాలుగు చినుకులు పడితే సరేసరి..ఆ ట్రాఫిక్ జాతర నుంచి ఎప్పటికి బయటపడతామో క్లారిటీ ఉండదు. అయితే నిత్యం ట్రాఫిక్ లో ఎక్కువ సమయం గడిపేవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది ఓ అధ్యయనం, ఇంకా ఆరోగ్యానికి సంబంధించి చాలా షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
ట్రాఫిక్ సౌండ్స్ నిత్యం వింటే గుండెకు ప్రమాదం
ట్రాఫిక్ సౌండ్స్ ను నిత్యం వింటే 5 ఏళ్లలో గుండెపోటు వచ్చే ముప్పు ఉంటుందని తేల్చి చెప్పింది అమెరికాలోని మసాచుసెట్స్ లో వైద్యుల అధ్యయనం. స్టడీ రిపోర్ట్ ప్రకారం 53 డెసిబుల్స్ కంటే ఎక్కువ ట్రాఫిక్ శబ్దం అనారోగ్యానికి గురి చేస్తుంది. ఈ పెద్ద శబ్దాలు నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. గుండె వేగాన్ని, బీపీని పెంచుతాయి. దీంతో ఐదేళ్లలో గుండెపోటు గండం నుంచి తప్పించుకోలేం అన్నది స్టరీ సారాంశం. శబ్ద కాలుష్యం వల్ల స్ట్రెస్ హార్మోన్లు అడ్రినలిన్, కార్టిజాల్ శరీరంలో రిలీజ్ అవుతాయి. సౌండ్ పొల్యూషన్ ఎఫెక్ట్ తో ధమనులు కూడా గట్టిపడుతున్నాయని, టాన్జిల్స్ లో వాపు వస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. బీపీ, హార్ట్ బీట్ లెవెల్ పెరగడానికి కూడా ట్రాఫిక్ సౌండ్స్ కారణమవుతున్నాయని స్టడీలో తేలింది. ధ్వనిని డెసిబుల్స్ లో కొలుస్తారు. పటాకులు పేల్చినప్పుడు వచ్చే సౌండ్ దాదాపు 140 dB ఉంటుంది. సౌండ్ 10 dB పెరిగే కొద్దీ మన చెవిపై దాని నెగెటివ్ ఎఫెక్ట్ పెరిగిపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోడ్డుపై వాహన ట్రాఫిక్ శబ్దం 53 dB కంటే ఎక్కువ ఉంటే ఆరోగ్యంపై అధిక ప్రభావం తప్పదు. నిత్యం 35 డెసిబుల్స్ కి మించిన సౌండ్స్ వినేవారిలో మూడు నాలుగేళ్లలో గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో వెల్లడైంది.
ఇతర అనారోగ్య సమస్యలు
ట్రాఫిక్ రద్దీవల్ల గాలిలో నాణ్యత తగ్గించి కాలుష్యం పెరుగుతుంది. ఈ గాలి పీల్చిన వాహనదారులు, డ్రైవర్లు, ప్రయాణికులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు, అధిక రక్తపోటు, ధమనుల వాపుకు వాయుకాలుష్యం కారణమవుతుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ప్రయాణీకుడికి గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితి వస్తే వారు చికిత్స కోసం సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేని పరిస్థితి. వీటితో పాటూచాలా దీర్ఘకాలిక రోగాలకు కారణం ట్రాఫిక్ రద్దీలో ప్రయాణం. మహానగరాల్లో ఈ సమస్య నుంచి తప్పించుకేలేరు కానీ ఏవో ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం వల్ల కొంతైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
గమనిక: పలు పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం