యముడి పేరు వింటే ఒంట్లో వణుకు ప్రారంభమవుతుంది. ఆ పాశం నుంచి తప్పించుకోవడం ఎవ్వరితరమూ కాదు. కానీ అపమృత్యు భయం తొలగిపోవాలన్నా ఆ యముడినే ప్రార్థించాలంటారు పెద్దలు. ప్రత్యేకంగా యముడి కోసం ఓ ఆలయం ఉంది. ఆ విశేషాలేంటో చూద్దాం..
ధర్మపురి దర్శిస్తే యమపురి ఉండదు
దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరి నదీతీరంలో వెలసిన ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ ఆలయం నవనారసింహ క్షేత్రాల్లో ఇదొకటి. జగిత్యాల జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం మొత్తం సాలగ్రామ శిలతోనే తయారైంది. విగ్రహం చుట్టూ దశావతారాల ముద్రలు సుందరంగా కనిపిస్తుంటాయి. ప్రశాంత చిత్తంతో స్వామివారిని తలచినంతనే దుఃఖాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. దక్షిణ కాశీగా విరాజిల్లుతోన్న ఈ ఆలయ ప్రాంగణంలో యమధర్మరాజు కోవెల ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకుని యముడికి నమస్కరించుకుంటే అపమృత్య భయం, అకాల మృత్యువు ఉండదంటారు పండితులు. అందుకే ‘ధర్మపురికి వస్తే యమపురి ఉండదు’ అంటారు. అంటే మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి ఉంటుందని అర్థం.
అకాల మృత్యువు దరిచేరదు
ధర్మవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించడం వల్లే ధర్మపురి అనే పేరు వచ్చిందని చెబుతారు. వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం క్రీ.శ.1422-33 కాలంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైంది. తిరిగి 17వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు ధర్మపురి క్షేత్ర చరిత్ర తెలియజేస్తోంది. పామునే పతిగా పొందిన సత్యవతీదేవి ఎన్నో గుళ్లూగోపురాలూ తిరిగినా ఫలితం కనిపించలేదు. ధర్మపురికి వచ్చి నృసింహస్వామిని, యమధర్మరాజుని దర్శించుకుని గోదావరిలో స్నానం ఆచరించగానే ఆమె భర్తకు సర్పరూపం పోయి సుందర రూపం వచ్చినట్లు స్థల పురాణం. అందుకే ధర్మపురిని దర్శించిన వారికి యమపురి ఉండదంటారు. ఇక్కడ బ్రహ్మపుష్కరిణితోపాటు సత్యవతీ ఆలయం ప్రసిద్ధి చెందింది. స్వామివారిని దర్శిస్తే మానసిక, శారీరక బాధల నుంచి విముక్తి లభిస్తుందనీ, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనీ, అకాల మృత్యువు దరిచేరదని భక్తుల విశ్వాసం.
ఆలయంలో ప్రత్యేక రోజులివే
ఏటా ఈ ఆలయంలో శ్రీనృసింహ నవరాత్రి ఉత్సవాలూ, శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున కోనేరులో జరిగే పంచసహస్ర దీపాలంకరణల్లో పాల్గొనడానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అలాగే ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలూ, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఇక్కడ ఘనంగా జరుపుతారు.గోదావరి నదీ తీరంలో ఏటా కార్తీకమాసంలో అమావాస్య నుంచి పౌర్ణమి వరకూ నిత్యం గంగాహారతి ఇస్తారు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం