కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏ మాట చెప్పినా చాలా పవర్ ఫుల్ స్టేట్ మెంట్ అవుతుంది. పార్టీ నేతలకు శ్రేణులకు అదీ దిశానిర్దేశం చేసినట్లవుతుంది. పార్టీ పెద్దగా బీజేపీ నేతల్లో ఆయన పట్ల అమితమైన గౌరవం ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ వారందరినీ అమిత్ షా ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. మహా జనసంపర్క్ అభియాన్ లో భాగంగా ఆయన దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్తూ పార్టీవారిని ఉత్తేజ పరుస్తున్నారు.
కాంగ్రెస్ అవినీతి, బీజేపీ సంక్షేమం
అమిత్ షా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో పర్యటించారు. దుర్ఘ్ జిల్లా భిలాయ్ తో ఆయన సభకు విశేష స్పందన వచ్చింది. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం స్కాములకు కేంద్ర బిందువుగా మారిందని అమిత్ షా గుర్తు చేశారు. దుర్గ్ డివిజన్లో 20 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 18 చోట్ల కాంగ్రెస్ ను గెలిపించినా ప్రయోజనం కనిపించలేదని ఆయన అన్నారు. మద్యం సహా అనేక అంశాల్లో భూపేష్ భాగేల్ ప్రభుత్వం అవినీతికి ఆలవాలమైందని ఆయన ఆరోపించారు. ఇటీవల జరిగిన ఈడీ దాడులను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా అవినీతి చేస్తుందని, ప్రధాని మోదీ నేతృత్వంలోనే ఎన్డీయే సర్కారు అవినీతికి దూరంగా ప్రజా సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో కేంద్రం ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, మోదీ పాలనను ప్రపంచ దేశాధినేతలే ప్రశంసిస్తున్నారని అమిత్ షా నిగ్గు తేల్చారు.
కేంద్రం అమోఘం, రాష్ట్రాలు శూన్యం
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కింది స్తాయి వరకు ప్రజలకు సాయం చేస్తుంటే రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నియని బీజేపీ అంటోంది. ఇందుకు ధాన్యం సేకరణనే బీజేపీ ఉదాహరణగా చూపిస్తోంది. ఛత్తీస్ గఢ్ నుంచి 92 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మోదీ ప్రభుత్వ విజయంగా అమిత్ షా చెప్పారు. ఇందు కోసం కేంద్రం వైపు నుంచి రైతులకు రూ. 74,000 కోట్లు బట్వాడా చేశామన్నారు. అందుకే ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ వాటా కేవలం రూ.12,600 కోట్లు మాత్రమేనన్నారు. గతంలోని రమణ్ సింగ్ నేతృత్వ బీజేపీ ప్రభుత్వం పారదర్శక ధాన్యం సేకరణ విధానాన్ని ప్రవేశ పెడితే దాన్ని వాడుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదేని అమిత్ షా గుర్తు చేశారు.
రాష్ట్రాలకు ప్రాధాన్యమిస్తున్న కేంద్రం
మోదీ ప్రభుత్వం రాష్ట్రాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని బీజేపీ చెబుతోంది. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో ఛత్తీస్ గఢ్ కు రూ.3 లక్షల కోట్లు కేటాయించారని, అంతకముందు పదేళ్ల మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేవలం రూ. 72 వేల కోట్లు మాత్రమే కేటాయించారని అమిత్ షా గుర్తుచేశారు. రూ.1.5 లక్షల కోట్ల రుణంతో ఛత్తీస్ గఢ్ ను రుణగ్రస్త రాష్ట్రంగా మార్చిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుంది. మద్యనిషేధం, నిరుద్యోగ భృతి లాంటి హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగుడుతూ వచ్చే ఎన్నికల్లో ఛత్తీస్ గఢ్ బీజేపీ హస్తగతం అవుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.