కేటీఆర్‌ది కూడా అదే ప్లానా ? అమిత్ షాతో భేటీకి తీవ్ర ప్రయత్నాలు !

తెలంగాణలో బీజేపీని కట్టడి చేయడానికి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న రాజకీయ కుట్ర పూరిత ప్రయత్నాల్లో మరిన్ని ప్రత్యేకమైన వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంలో ముందుండే కేటీఆర్ ఇప్పుడు.. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశం అయ్యేందుక ుసిద్ధమయ్యారు. రెండు రోజుల డిల్లీ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్.. అమిత్ షాతో భేటీ కోసం అపాయింట్ మెంట్ అడిగారు. తెలంగాణ కీలక మంత్రి అడిగితే… అపాయింట్ మెంట్ అడిగితే నిరాకరించడం ప్రజాస్వామ్య లక్షణం కాదు కాబట్టి షా సమయం కేటాయిస్తారు. కానీ వారు ఈ అవకాశాన్ని బీజేపీని దెబ్బకొట్టడానికి వినియోగించుకునే అవకాశాలే ఉన్నాయి.

బీజేపీ .. తాము ఒకటేనని చెప్పుకునేందుకు కేటీఆర్ ప్రయత్నాలు ?

గతంలో బీజేపీపై యుద్ధం ప్రకటించినా కొంత కాలంగా బీఆర్ఎస్ నేతలు సైలెంట్ గా ఉన్నారు. దీనికి కారణం బీజేపీ.. తాము ఒక్కటేననే ముద్ర వేసుకోవడానికేనని అంటున్నారు. ఇలా చేయడం వల్ల బీజేపీని దెబ్బకొట్టి కాంగ్రెస్ ను లేపే ప్లాన్ అంటున్నారు. గతంలోనూ పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌ కేంద్ర మంత్రులను కలిసినా.. అమిత్‌ షాతో భేటీ కాలేదు. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆయనను కలవనున్నారు. నిన్న మొన్నటి వరకూ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీఆర్‌ఎస్‌ నేతలు కొద్ది కాలంగా మౌనం పాటిస్తున్నారు. ఇదంతా కుట్ర పూరిత వ్యూహమని బండి సంజయ్ కూడా ఇప్పటిక ేఆరోపించారు.

తెలంగాణలో అధికారం కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నం

ఇటీవల కాలంలో రాష్ట్రానికి పలుమార్లు వచ్చిన అమిత్‌ షా అనేక బహిరంగసభల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శలు చేశారు. తెలంగాణతో ఒక్క కుటుంబానికే లబ్ధి చేకూరిందని, రాష్ట్రప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు కురిపించారు. దీనికి మంత్రి కేటీఆర్‌ సైతం అదేస్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు. కానీ బీజేపీ ని దెబ్బకొట్టాలంటే… ఆ పార్టీని విమర్శించకూడదని… కలిసి ఉన్నట్లుగా ప్రజల్లోకి ఓ భావన పంపాలనే స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ రాజకీయాలు జరుగుతున్నట్లుగా భావిస్తున్నారు.

కాంగ్రెస్ చేరిక ప్రచార వ్యూహం అంతా బీఆర్ఎస్ దేనా ?

కాంగ్రెస్ లో చేరికల ప్రచారం వెనుక .. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హస్తం ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. బీజేపీని దెబ్బకొట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ జరుగుతోందన్న వాతావరణాన్ని సృష్టించి ఓట్ల పోలరైజేషన్ చేయాలన్న ప్లాన్ అమలు చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ ప్లాన్ త్వరగానే ప్రజలకు అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయని… అందు కోసం బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకోబోతోందని చెబుతున్నారు.