ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ అండర్ ప్లే చేస్తోంది. వైసీపీ, టీడీపీలతోనే ఆ పార్టీ ల అవసరం ప్రజలకు లేదని పరోక్షంగా చెప్పిస్తోంది. తాము బీజేపీ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నామని ఆ పార్టీ నేతలు ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటప్పుడు ప్రాంతీయ పార్టీల నేతలతో పనేముందని.. నేరుగా బీజేపీనే రాష్ట్రంలో అధికారం అప్పగిస్తే ప్రాంతీయ పార్టీల రాజకీయాల్ని పక్కన పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పేందుకు బీజేపీ రెడీ అవుతోంది..
బీజేపీకి మిత్రులమేనని చెప్పుకునేందుకు అన్ని పార్టీలు పోటాపోటీ
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థులు ఎవరూ లేరు. అందరూ మిత్రులే. జనసేన పార్టీ నేరుగా పొత్తులో ఉంది. దేశం కోసం బీజేపీకి మద్దతిస్తామని .. వైఎస్ఆర్సీపీ నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ బీజేపీ పెద్దలు వచ్చి తీవ్ర విమర్శలు చేసినా వారు బీజేపీకే మద్దతంటున్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో సఖ్యతగా ఉంటోంది . భారతీయ జనతా పార్టీ విషయంలో టీడీపీ వ్యతిరేకంగా లేదు. చంద్రబాబు సానుకూలంగా మాట్లాడుతున్నరు. బీజేపీ మద్దతు కోరుకుంటున్నారు. బీజేపీ మద్దతు ఉంటేనే ఏదైనా చేయగలమని అనుకుంటున్నారు. ఇక బీజేపీ పెద్దలు తీవ్రమైన ఆరోపణలు చేసినా సరే.. తాము బీజేపీకే మద్దతు ఇస్తాం అనే రాజకీయ చక్రబంధంలో వైఎస్ఆర్సీపీ ఉంది. రాష్ట్రంలో రోజు గడవాలంటే బీజేపీ మద్దతు ఉండాలనుకుంటు్నారు.
ఇదంతా బీజేపీ మాస్టర్ ప్లాన్ !
ఎలా చూసినా ఏపీలో బీజేపీని ఎవరూ వ్యతిరేకించడం లేదు. అందరూ అభిమానిస్తున్నారని ప్రస్తుతం ఏపీలో ఉన్న పార్టీల పరిస్థితిని బట్టి అర్థమైపోతుంది. కాస్త విడమర్చి చూస్తే.. బీజేపీ హైకమాండ్ .. ఏపీలో ఇలాంటి పరిస్థితి తెచ్చిందని అనుకోవచ్చు. గత ఎన్నికల్లో బీజేపీని విలన్ ను చేయాలని చూసి.. టీడీపీ బోర్లాపడింది. అప్పట్నుంచి బీజేపీతో సంబంధాల కోసం ప్రయత్నిస్తోంది. ఇటీవల ఢిల్లీలో అమిత్ షా , నడ్డాలతో భేటీ ద్వారా ఆ అభిప్రాయం కల్పించుకున్నారు. కానీ అకల్పించేలా అవకాశం ఇచ్చింది బీజేపీ. అంటే ఇప్పుడు బీజేపీ కి ఏపీ పార్టీ కూడా వ్యతిరేకం కాదు.
బీజేపీ సహకారంతో చేసేది ఏమిటి.. బీజేపీకే అధికారం ఇస్తే సరిపోదా ?
ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా.. బీజేపీ సహకారం ఉండాల్సిందే. అందుకే ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నామని చెబుతోంది. బీజేపీ సహకారం తో అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. అంతగా బీజేపీ ఇచ్చే సహకారం కోసం సన్నిహితంగా ఉండే బదులు అసలు బీజేపీకే అధికారం ఇస్తే.. ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో ఆలోచించండి అనే కాన్సెప్ట్ తో ప్రజల ముందుకు వెళ్లేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలు కుల, మత అజెండాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాయని… అదే బీజేపీకి అభివృద్ధి మాత్రమే ఎజెండాగా ఉంటుందని ఓటర్లకు చెప్పే ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తంగా ఏపీలో బీజేపీ మాస్టర్ ప్లాన్ అమల్లో ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.