వైసీపీలో నిన్నామొన్నటిదాకా నెంబర్ టుగా ఉన్న విజయసాయిరెడ్డికి జగన్ షాకిచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమీక్షలో సాయన్న ముసలాయన అయిపోయారని ఆయన అన్ని పనులు చూసుకోలేని .. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లుగా ప్రకటించారు. దీంతో విజయసాయిరెడ్డిని జగన్ మోహన్ రెడ్డి సంపూర్ణంగా పక్కన పెట్టినట్లేనన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే విజయసాయిరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు.
చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న విజయసాయిరెడ్డి
గతంలో విజయసాయి రెడ్డి దారుణమైన భాషలో విపక్షాలను తిడుతూ.. ట్వీట్లు పెట్టేవారు. వైసీపీ తరపున ఢిల్లీలో కీలక బాధ్యతలు నిర్వహించేవారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో కీలక బాధ్యతల్లో ఉండేవారు. అయితే గత ఏడాదిన్నర నుంచి ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. ఎందుకో తెలియదు కానీ ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు. పార్టీలో పదవులను తప్పించారు. కీలకమైన సోషల్ మీడియా బాధ్యతలు.. వాలంటీర్లను చూసుకునే బాధ్యతల నుంచి కూడా తప్పించారు. అనుబంధ సంఘాల ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారు కానీ.. ఆయన వాటిని పట్టించుకోలేదు.. ఎందుకో కానీ రెండో సారి రాజ్యసభ ఇచ్చిన తర్వాత జగన్ తో గ్యాప్ పెరిగిపోయిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలే అనుబంధ సంఘాలతో వరుస సమావేశాలు
ఎన్నికలు దగ్గర పడుతూండటంతో విజయ.సాయిరెడ్డి ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యారు. అనుబంధ సంఘాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. అందరూ పార్టీ విజయం కోసం పని చేయాలని చెబుతున్నారు. అయితే ఇప్పుడు అనుబంధ సంఘాల బాధ్యతలు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చినట్లుగా జగన్ ఎమ్మెల్యేల సమావేశంలో ప్రకటించడం.. సాయన్న ముసలాయన అయిపోయారని చెప్పడంతో… ఆయన సేవలు ఇక వద్దనుకుంటున్నట్లుగా స్పష్టమవుతోందని అంటున్నారు.
సజ్జలదీ అదే వయసు… కీలక బాధ్యతల్లో ఉన్నారుగా !
నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి ఒకే వయసుకు చెందిన వారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో పెత్తనం చెలాయిస్తున్నారు. కానీ విజయసాయిరెడ్డిని మాత్రం దూరం పెట్టేశారు. తెర వెనుక.. ఏం జరిగిందో కానీ.. విజయసాయిరెడ్డిపై జగన్ పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోయారని అందుకే ముసలాయన అనే ట్యాగ్ వేసి.. రిటైర్మెంట్ ప్రకటించేశారన్న గుసగుసలు.. వైసీపీలో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో విజయసాయిరెడ్డిది కీలక పాత్ర. ఈ సారి ఆయనను పక్కన పెట్టడం కీలకంగా మారింది.