విపక్షం అంటే ఒక ప్రెజర్ గ్రూప్. ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పొప్పులుంటే వాటిని వేలెత్తి చూపుతూ, తమ వైపు నుంచి ప్రభుత్వానికి సలహాలిస్తూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. దేశంలో విపక్షాలు మాత్రం ప్రజాసేవలో తరిస్తున్నట్లుగా కనిపించడం లేదు. అంతర్గత కుమ్ములాటలతో దేశ సంక్షేమాన్ని వదిలేసినట్లుగానే అనిపిస్తోంది. అధికారంలో ఊంటే దోచుకోవడం, దాచుకోవడం.. విపక్షంలోకి వస్తే వాళ్లలో వాళ్లు కొట్టుకోవడం ఇప్పుడు బీజేపీయేతర పార్టీలకు నిత్యకృత్యమైంది.
శరద్ రావుపై అలిగిన అజిత్ పవార్
మహారాష్ట్ర విపక్ష కూటమిలో కీలక పాత్ర పోషించే ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ రావు పవార్ పై ఆయన బంధువున మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అలిగారు. తనకు విపక్షనేత పదవి వద్దని బహిరంగంగానే ప్రకటించారు. పార్టీ పదవి ఇస్తే పనిచేసుకుపోతానని విపక్ష నేత పదవిలో ఇమడలేక ఇబ్బంది పడుతున్నానని చెప్పుకున్నారు. విపక్ష నేత పదవిని తాను కోరుకోలేదని ఎమ్మెల్యేలంతా బలవంతపెట్టి తానను ఆ పదవిలో కూర్చోబెట్టారని, అందులో ఇమడలేకపోతున్నానని వాపోయారు. టీవలి కాలంలో అజిత్ పవార్ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నా శరద్ పవార్ సంయమనం పాటిస్తున్నారు. ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కొంతకాలం క్రితం శరద్ పవార్ ప్రకటిస్తే వద్దని వారిస్తూ పార్టీ నేతలంతా ఆయన్ను బతిమాలారు.అజిత్ పవార్ మాత్రం శరద్ పవార్ ఎవరి మాట వినరని ఆయన తప్పుకుంటారని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
జయంత్ పాటిల్ తో విభేదాలు
ఎన్సీపీలో ఇప్పుడు రెండు గ్రూపులున్నాయి. పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ గ్రూప్ అంటే అజిత్ పవార్ కు గిట్టడం లేదు. గత ఐదేళ్లుగా జయంత్ పాటిల్ మహారాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.పార్టీ రాజ్యాంగం ప్రకారం మూడేళ్ల పదవీకాలం అయిపోయిన తర్వాత ఆయన ఎందుకు తప్పుకోలేదని అజిత్ పవార్ వర్గం ప్రశ్నిస్తోంది. మహారాష్ట్ర శాఖాధ్యక్షుడి పదవిని అజిత్ పవార్ తనకు కట్టబెట్టాలని కోరుకుంటున్నట్లు కొందరు అంటున్నారు. తన అనుచరుడికి ఇచ్చినా ఫర్వాలేదని, జయంత్ పాటిల్ మాత్రం ఆ పదవిలో కొనసాగకూడదని అజిత్ పవార్ భావిస్తున్నారట.
అజిత్ ప్రాధాన్యం తగ్గిందా ?
పార్టీలో అజిత్ పవార్ ప్రాధాన్యం తగ్గించాలని శరద్ పవార్ నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. పార్టీ విధానానికి విరుద్ధంగా ఆయన సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ తో కలిసిపోయారని శరద్ పవార్ అనుమానిస్తున్నారు. పవార్ తనయ సుప్రియో సూలే, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవినిచ్చి అజిత్ కు ఎలాంటి అదనపు పదవిని కట్టబెట్టలేదు. ఇదీ అజిత్ ను కించపరచడమే అవుతుందని ఆయన అనుచరులు అంటున్నారు. దానితో ఇప్పుడాయన తనదైన శైలిలో శరద్ పవార్ కు షాకివ్వాలని చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు….