బెంగాల్ ఎన్నికల హింస – సీబీఐ విచారణకు ఆదేశం

పశ్చిమ బెంగాల్ రావణ కాష్టమై మండుతోంది. పంచాయితీ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం తృణమూల్ కాంగ్రెస్ హింసను ప్రేరేపిస్తోంది. ఎక్కడికక్కడ ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారు. ప్రత్యర్థులను చంపి… ఎన్నికల్లో గెలిచామనిపించుకోవాలన్న ఆటవిక ప్రవృత్తి జనంలో కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థులు బరిలో ఉండకూడన్న ఆలోచనతోనే మమతా బెనర్జీ పార్టీ హింసను ప్రేరేపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అల్లర్లలో పది మంది మృతి

పంచాయతి ఎన్నికల హింసలో పది మంది వరకు చనిపోయారు. నలుగురు మరణించినట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ చనిపోయివారు డబుల్ డిజిట్ లో ఉంటారని విపక్షాలు అంటున్నారు. తృణమూల్ దాడుల్లో వందల మంది వరకు గాయపడ్డారు. బాంబులు విసురుతూ, కాల్పులు జరుపుతూ ప్రత్యర్థులను భయపెడుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాహనాలను, ప్రత్యర్థి పార్టీ వాళ్ల ఇళ్లను తగులబెడుతున్నారు.

నాలుగైదు జిల్లాల్లో పరిస్థితి దారుణం

బెంగాల్లో కొన్ని జిల్లాలు హింసకు కేంద్రంగా మారుతున్నాయి. అందులో ఉత్తర దినాజ్ పూర్, ముషీదాబాద్, భాంగర్, దక్షిణ 24 పరగణాల్లో ఎక్కువ హింస జరిగింది. నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు అయిన జూన్ 15న పదుల సంఖ్యలో ప్రత్యర్థుల వాహనాలకు తగులబెట్టారు. నామినేషన్లు వేసేందుకు వెళ్లి వస్తున్న వారిని కొట్టి చంపారు. ఓటర్ల జాబితాలోనూ అధికార పార్టీ గోల్ మాల్ చేసింది. వేలాది మంది పేర్లు జాబితా నుంచి మాయమయ్యాయి. అదేమని అడిగితే దాడులు చేస్తున్నారు.

ఎన్నికలను నిలిపివేయాల్సి రావచ్చు – కోల్ కతా హైకోర్టు

జూలై 8న ఒకే దశలో బెంగాల్ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. హింస, హింస, రక్తపాతం కొనసాగితే ఎన్నికలను నిలిపేయాల్సి వస్తుందని కోల్ కతా హైకోర్టు హెచ్చరించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం ఈ కేసులను విచారిస్తూ బెంగాల్ ఎన్నికల కమిషన్ ఉదాసీనతపై మండిపడింది. దానితో 22 కంపెనీల కేంద్ర బలగాలను రప్పిస్తున్నట్లు బెంగాల్ ఈసీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రతీ జిల్లాలో కేంద్ర బలగాలను మోహరిస్తామని ప్రకటించింది. ఈ దిశగా సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు జరుపుతున్నట్లు ప్రకటించింది. ఎన్నికలు నిర్వహించడమంటే హింసకు లైసెన్స్ ఇచ్చినట్లు కాదని మమత ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు వేసింది. అభ్యర్థులను, కార్యక్రర్తలను చంపేస్తే అవి స్వేచ్ఛాయుత ఎన్నికలు ఎలా అవుతాయని కోర్టు ప్రశ్నించింది. నామినేషన్ల ప్రక్రియలో హింసాకాండపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. వీలైనంత తర్వగా విచారణ నివేదిక సమర్పించాలని సూచించింది. కోర్టు ఉత్తర్వులతో కేంద్రం కూడా కదిలింది. తక్షణమే ఎనిమిది కంపెనీల బీఎస్ఎఫ్, ఆరు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను బెంగాల్ పంపుతున్నట్లు, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన ప్రదేశాల్లో వాటిని మోహరిస్తామని వెల్లడించింది. మరి ఇకనైనా హింస తగ్గి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగతాయో లేదో చూడాలి.