గాయని ఫల్గుణితో కలసి పాట రాసి పాడిన ప్రధాని మోదీ – ఆ పాట ప్రత్యేకత ఏంటంటే!

దేశానికి ఆదర్శవంతమైన పాలన అందించడమే కాదు సమయం, సందర్భాన్ని బట్టి తనలో అంతర్లీనంగా దాగిఉన్న కళను ప్రదర్శించడంలో మేటి మన ప్రధాని నరేంద్ర మోదీ. గాయని ఫల్గుణితో కలసి ఓ పాటకు రచనా సహకారంతో పాటూ గాత్ర సహకారం కూడా అందించారు మోదీ. ఆ పాట ప్రత్యేకత ఏంటంటే…

ఈ ఏడాదిని ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించిన సందర్భంగా ప్రధాని కోరిక మేరకు గాయని ఫల్గుణి తన భర్త గౌరవ్‌ షాతో కలిసి మిల్లెట్స్‌పై ఓ పాట రాసి పాడింది. ఈ పాటకున్న ప్రత్యేకత ఏంటంటే మోదీ కూడా పాటరచనతో పాటు గాత్ర సహకారాన్నీ అందించారు. సందేశాత్మక పాటలు రాస్తూ, చిన్నారుల్లో స్ఫూర్తి నింపేలా పాటలు పాడుతూ సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకతని సొంతం చేసుకున్న ఫల్గుని గతేడాది రెండో గ్రామీ అవార్డు అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్రకెక్కిన ఆమె తాజాగా చిరుధాన్యాల ప్రాముఖ్యత, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను బాణీలుగా సమకూర్చుకుని ‘Abundance of Millets’ పేరుతో మోదీతో కలసి పాట రాసి పాడారు.

గ్రామీ అవార్డు గెలుచుకున్నాక మోదీని కలిసా
గ్రామీ అవార్డు గెలుచుకున్న తర్వాత ముంబై వచ్చిన ఫల్గుణి..అదే సమయంలో ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిందట. ఆ సమయంలో మోదీ సూచన మేరకే ఈ మిల్లెట్స్ సాంగ్ అని చెప్పింది. పాట రాసేందుకు సహకరించాలని మోదీని కోరగా ఆయన అంగీకరించడంతో ప్రధాని మోదీ, భర్త గౌరవ్ తో కలసి ఆమె పాట రాశారు. కేవలం రాతవరకే కాదు గాత్రాన్ని కూడా ఇచ్చారు మోదీజీ. పాట మధ్యలో మోదీ స్వరం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చెబుతోంది ఫల్గుణి. ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌ ఈ రెండు భాషల్లోనే అందుబాటులో ఉన్న ఈ పాటను త్వరలోనే ఇతర ప్రాంతీయ భాషల్లోకీ అనువదించి ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల ప్రాముఖ్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాం అని చెప్పుకొచ్చింది ఫల్గుణి. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ.. ఫల్గుణి దంపతులతో కలిసి ఈ పాటను ఆవిష్కరించారు.

ముంబైకి చెందిన ఫల్గుణి స్వదేశంలో సంగీతాన్ని అవపోసన పట్టి 2000లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది. అక్కడ యూనివర్సిటీలు, క్లబ్స్‌, ఫెస్టివల్‌ సర్క్యూట్‌ వేదికలపై ప్రదర్శనలిచ్చింది. ఆ తర్వాత న్యూయార్క్‌ వెళ్లి ‘Falu Music’ పేరుతో సొంత బ్యాండ్‌ ప్రారంభించింది. క్రమక్రమంగా భారతీయ సంగీత శైలికి ఆధునిక శైలిని జత చేస్తూ ఆమె రూపొందించిన ఆల్బమ్స్‌ ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి. 2009లో అప్పటి యూఎస్‌ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దంపతుల సమక్షంలో ఏఆర్‌ రెహమాన్‌తో కలిసి సంగీత ప్రదర్శన ఇచ్చింది. తన అద్భుతమైన గాత్రం, ప్రతిభతో రెండుసార్లు గ్రామీ అవార్డు దక్కించుకుంది ఫల్గుణి. తాజాగా మిల్లెట్స్ సాంగ్ తో వచ్చింది. ఇందులో మోదీ సలహా సూచనలతో పాటూ రచన, గాత్ర సహకారం కూడా ఉండడంతో మిల్లెట్స్ సాంగ్ గురించి చర్చ జరుగుతోంది.