అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా భారత కీర్తి ఖండాంతరాలకు వ్యాపించింది. భారతీయుల జీవన విధానం, వారి ఆరోగ్య సూత్రాలు ప్రపంచ మానవాళికి తెలిసొచ్చాయి. అన్ని వ్యాయామాల్లో యోగా మేటిదని అందరూ గుర్తించారు.. యోగాతో ఆధ్యాత్మిక చింతన కూడా సాధ్యమని తేల్చారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ విషయం అర్థం కావడం లేదు. బీజేపీకి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందోనన్న భయంతో అర్థం పర్థం లేని ప్రకటనలిస్తూ జనాన్ని అయోమయంలోకి నెట్టేస్తున్నారు.
యోగాకు నెహ్రూ ప్రాచుర్యం తెచ్చారంటున్న కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ వితండవాదానికి పెట్టింది పేరు. ఎవరు ఏ పని చేసినా తమ పార్టీకి లింకు పెట్టుకోవడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తుంటారు. తాజాగా తొమ్మిదో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న వేళ కాంగ్రెస్ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ యోగా చేస్తున్న ఓ ఫోటోను ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. యోగాకు బహుళ ప్రాచుర్యం తీసుకురావడంలో నెహ్రూ కృషి ప్రశంసనీయమని కాంగ్రెస్ అంటోంది. యోగాను ఓ జాతీయ విధానంగా కూడా నెహ్రూ ప్రకటించారని కాంగ్రెస్ గుర్తు చేసింది.
కాంగ్రెస్ కు కౌంటరిచ్చిన శశి థరూర్
హస్తం పార్టీకి బీజేపీ కంటే ముందే సొంత పార్టీ నేతల నుంచి సమాధానం వచ్చింది. నెహ్రూ సంగతి సరేసరి.. యోగాను పునరుద్ధరించి, ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసిన వారి సేవలను కూడా గుర్తించాలని కాంగ్రెస్ కు థరూర్ చురకలు అంటించారు. ప్రస్తుత ప్రభుత్వం చర్యలను కూడా గుర్తించాల్సిందేనన్నారు. ఆ దిశగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి తరపున నిర్వహించేందుకు మోదీ చేసిన కృషిని ఆయన పరోక్షంగా ప్రస్తవించారు. మోదీ చర్యల వల్లే యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని థరూర్ ఒప్పుకున్నట్లయ్యింది.
ఇల్లు అలకగానే పండుగ కాదు…
కాంగ్రెస్ పార్టీని థరూర్ ఇటీవల కూడా విమర్శించారు. కర్ణాటక ఫలితాలను చూసి మురిసి పోవాల్సిన అవసరం లేదని, ఇల్లు అలకగానే పండుగ కాదని ఆయన అన్నారు. ఒక రాష్ట్రంలో వర్కవుట్ అయినంత మాత్రాన అన్ని రాష్ట్రాల్లో అవే ఫలితాలు వస్తాయనడానికి వీల్లేదని హెచ్చరించారు. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్…. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం అవే రాష్ట్రాల్లో చతికిలబడిందని ఆయన గుర్తు చేశారు. అందుకే కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇతర రాష్ట్రాలల్లో ప్రతిబింబిస్తాయని చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు. లోక్ సభకు ఓటింగ్ సరళి, ఫలితాలు వేరుగా ఉంటాయని ఆయన అంటున్నారు. మరి ఆ సంగతి కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతుందో లేదో చూడాలి.