యోగాతో ఇన్ని లాభాలా, చాలా రోగాలకు చక్కని పరిష్కారం యోగా!

యోగా శరీరంతో పాటు మెదడుపైనా ప్రభావం చూపిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. క్రమం తప్పకుండా యోగ చేయడం ద్వారా ఎన్నో వ్యాధులను తరిమికొట్టొచ్చని చెబుతారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పేరుతో మరింత ప్రచారం కల్పిస్తున్నారు.

యోగా అనే పదం సంస్కృత మూలం ‘యుజ్’ నుండి ఉద్భవించింది. దీని అర్థం ‘ ఒక దగ్గరికి చేర్చడం’ లేదా ‘ఏకం చేయడం’ అని. యోగ గ్రంధాల ప్రకారం యోగాభ్యాసం ఒక మనిషి వ్యక్తిగత స్పృహను, సామాజిక స్పృహతో ఏకం చేస్తుంది. మనస్సు, శరీరం మధ్య సంపూర్ణ ఏకత్వాన్ని అందిస్తుంది. రుషులు పూర్వకాలంలో యోగాను అనుసరించడం వల్లే ఎక్కువ కాలం జీవించే వారని చెబుతారు. ఏ వ్యాయామంతో పోల్చి చూసినా యోగాలో ఉన్న చాలా విశిష్టతలు యోగాని ప్రత్యేకంగా నిలబెడతాయి.

ఒత్తిడిని జయించేలా చేస్తుంది
ఒత్తిడి మనిషికి అతిపెద్ద శత్రువు. యోగా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే శరీరంలో ఎండార్ఫిన్‌ స్థాయి పెరుగుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి, మెటబాలిజం, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా చేసే యోగా భావోద్వేగాలను నియంత్రించుకునేలా చేస్తుంది. కోపం, ఆందోళన, ఒత్తిడి, చికాకు, గందరగోళాన్ని తగ్గిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

శరీరంలో సానుకూల మార్పులు
యోగాసనాల క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్ అవుతుంది. క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేసేవారికి వారి కండరాల కదలికలో మార్పులు స్పష్టంగా తెలుస్తుంది

రోగ నిరోధకశక్తి పెరుగుతుంది
యోగా వల్ల వ్యాధినిరోధక శక్తి ఉత్తేజితమై ఉంటుంది. దగ్గులు, జలుబులు, జ్వరాలు, తలనొప్పులు ఇలా మనల్ని తరుచుగా వేధించే జబ్బులు అంత తేలిగ్గా మన దరికి చేరవు. నాడీ వ్యవస్థ కూడా చురుగ్గా పని చేస్తుంది.

మానసిక ప్రశాంతత
కొన్ని రోజుల యోగాభ్యాసంతో మీ మనస్సు మునుపటి కంటే చాలా ప్రశాంతంగా, పరధ్యానం లేకుండా ఉంటుంది. మీరు మీ శరీర శక్తిని సరైన దిశలో ఉపయోగించగలరు. ఒక లక్ష్యంపై దృష్టి పెట్టగల సామర్థ్యం యోగా ద్వారా మాత్రమే సాధించగలం.

క్రమశిక్షణ
యోగా వల్ల కేవలం శారీరక మానసిక ఆరోగ్యమే కాకుండా క్రమశిక్షణ కూడా అలవడుతుంది. సూర్యోదయానికి ముందే మేల్కోవడం, యోగా చేయడం దినచర్యలో భాగమై పోతుంది.

వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులకు చెక్
ఎముకల్లో ఉండే క్యాల్షియం వయస్సు పెరిగే కొద్దీ తగ్గిపోతూంటుంది. ఎముకలు బలహీనం అయిపోతాయి. ఈ పరిస్థితుల్లో బోలు ఎముకల వ్యాధి సోకె అవకాశం ఉంది. యోధుడి ఆసనం , ప్రక్క కోన ఆసనాలు చేయడం వల్ల ఎముకలు శక్తివంతం అవుతాయి

నిద్రలేమి ఉండదు
వారానికి రెండు సార్లు యోగా చేసినా కూడా అది మన మెదడుకి ఎంతో స్వాంతనను చేకూరుస్తుంది. ఒత్తిడిని దూరం చేసి మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది.

రక్తపోటుని తగ్గిస్తుంది
క్రమం తప్పకుండా యోగ చేయడం ద్వారా శరీరం అంతటా కూడా రక్తప్రసరణ బాగా జరుగుతుంది. శరీరంలో అన్నిభాగాలకు ఆక్సిజన్ సరఫరా బావుంటుంది. తద్వారా రక్తపోటు కి చెక్ పెడుతుంది.

జీవక్రియను పెంచుతుంది
తీసుకొనే ఆహారం సరైన పద్దతిలో జీర్ణం అవ్వాలి. సరిగ్గా జీర్ణం అవ్వకపోతే, పొట్టకు సంబంధించిన సమస్యలెన్నో తలెత్తుతాయి బరువు కూడా పెరిగిపోతారు.ఆహారం సరైన పద్దతిలో జీర్ణం అవ్వడానికి కూడా యోగ ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది
యోగా శరీరంలో ఉన్న కండరాలనే కాకుండా గుండె సంబంధిత కండరాలను కూడా శక్తివంతం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. యోగా వల్ల గుండె సరైన పద్దతిలో కొట్టుకోవడమే కాకుండా, రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.

మతిమరుపు తగ్గుతుంది
మొదడు సామర్ధ్యాన్ని మెరుగుపరచడం, దాని పనితీరు పెంచడానికి యోగా ఎంతగానో సహాయపడుతుంది. యోగా వల్ల మతిమరుపు వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని అధ్యయనాలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

మలబద్దకాన్ని నయం చేస్తుంది
జీర్ణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి యోగాలోని కొన్ని ఆసనాలు ఎంతగానో సహాయపడతాయి. పేగుల పై యోగా ఒత్తిడిని పెంచుతుంది మరియు విసర్జన సులభంగా సక్రమంగా జరగటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…