ఏపీలో ప్రాంతీయ పార్టీల రాజకీయాలు తెలివి మీరిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏదైనా ఆటలో పోటీపడాలంటే ప్రత్యర్థితో పోటీ పడి గెలవాలి. అసలు ప్రత్యర్థిని ఆడకుండా చేసి గెలుద్దామనుకునే వ్యూహాలు ఏపీలోనే ఉంటాయి. బీజేపీ విషయంలో మూడు ప్రాంతీయ పార్టీలు ఆడుతున్న రాజకీయాలు ఇలాగే ఉన్నాయి. బీజేపీతో స్నేహం ప్రకటిస్తూ.. వారిలో వారు పోరాడుకున్నట్లుగా నటిస్తున్నారు. ఏదైనా తమ మధ్యే రాజకీయం ఉండాలనుకుంటున్నారు. తాజాగా కాపు రాజకీయాలతో అదే తేటతెల్లమవుతోంది.
టీడీపీ వర్సెస్ వైసీపీ వర్సెస్ జనసేన
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. ఒకరిని విమర్శిస్తే మరొకరకు రెస్పాండ్ అవుతున్నారు. ఇలా రెస్పాండ్ అయ్యే వారు అదే పార్టీకి చెందిన వారు కాకపోవడం ఇక్కడ అసలు ట్విస్ట్. ద్వారంపూడిని, వైసీపీని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విమర్శిస్తే.. వెంటనే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లైన్లోకి వచ్చారు. అలా ఎలా విమర్శిస్తారని ఓ లేఖ రాసేశారు. ఇలా ముద్రగడ లేఖ రాయగానే.. జనేసన నాయకులు స్పందించలేదు. టీడీపీకి చెందిన బుద్దా వెంకన్న.. బీసీ నేత హోదాలో ప్రశ్నిస్తున్నానని కౌంటర్ ఇచ్చారు. అసలు ఈ ఎపిసోడ్ లో తర్వాత ఎవరు జోక్యం చేసుకుంటారో కానీ.. ఒకరికొకరికి సంబంధం లేదని ఈ రాకీయం నడుస్తోంది.
పోటీ తమ మధ్యే ఉందని చెప్పుకునే ప్రయత్నం
తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేస్తున్నపవన్ కల్యాణ్ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలకు ద్వారంపూడి కౌంటర్ ఇచ్చారు. అయితే అనూహ్యంగా కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం తెరపైకి వచ్చారు. ఆయన వైసీపీలో ఇంకా అధికారికంగా చేరలేదు. కానీ పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ.. ప్రశ్నిస్తూ తెర ముందుకు వచ్చారు. ముద్రగడ రాసిన లేఖకు.. జనసేన పార్టీ నుంచి చేగొండి హరిరామ జోగయ్య కౌంటర్ ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన బుద్దా వెంకన్న స్పందించారు. కాపు కులాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీని కాకుండా ఇతర పార్టీలను మాత్రమే ప్రశ్నిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా సీన్ అంతా తమ పార్టీల మధ్యే ఉండే లా చూసుకుంటున్నారు.
బీజేపీతో ఫ్రెండ్లీగా నటిస్తూ.. ఆ పార్టీని ఎదగకుండా చేసే వ్యూహం
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థులు ఎవరూ లేరు. అందరూ మిత్రులే. జనసేన పార్టీ నేరుగా పొత్తులో ఉంది. కానీ అది పేరుకే. కానీ కలిసి పోటీ చేస్తామని మాత్రం చెప్పడం లేదు. దేశం కోసం బీజేపీకి మద్దతిస్తామని .. వైఎస్ఆర్సీపీ నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ బీజేపీ పెద్దలు వచ్చి తీవ్ర విమర్శలు చేసినా వారు బీజేపీకే మద్దతంటున్నారు. బీజేపీ పెద్దలు అన్న మాటల వారివి కావని.. టీడీపీ మాటలని కవర్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో సఖ్యతగా ఉంటోంది కానీ.. పొత్తుల గురించి మాట్లాడటం లేదు. దీంతో ఏపీ బీజేపీ అర్థం కాని రాజకీయం చేయాల్సి వస్తోంది. దీంతో ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోతోందన్న వాదన వినిపిస్తోంది. దీన్ని చేధించాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.