జిల్లా స్థాయి సభల నిర్వహణలో బీజేపీ దూకుడు – ప్రజా స్పందనతో నేతల్లో మరింత ఉత్సాహం !

తొమ్మిదేళ్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనా విజయాలపై ఏపీ బీజేపీ నిర్వహిస్తున్న నెల రోజుల ప్రచార భేరీ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికి ఇద్దరు అగ్రనేతలుఏపీకి వచ్చి ఉత్తరాంద్ర, రాయలసీమల్లో బహిరంగసభలు నిర్వహించారు. అదే సమయంలో పలువురు జాతీయ నేతలు ఏపీలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర నేతలు.. పెద్ద ఎత్తున జిల్లా స్ధాయి సభలను నిర్వహిస్తున్నారు. ఆదివారం ఒకే రోజు.. రాష్ట్రం నలువైపులా నాలుగు సభలు నిర్వహించారు. అందులో పార్టీ అగ్రనేతలంతా పాల్గొన్నారు. మంగళవారం మరో మూడు జిల్లాల్లో బహిరంగసభలు నిర్వహించబోతున్నారు.

మంగళవారం మరో మూడు జిల్లాల్లో సభలు

బీజేపీ తొమ్మిదేళ్ల పాలన సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు జరుగుతున్నాయని.. కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు, మాజీ సీఎంలు, ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొంటున్నారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విజయవాడలో ప్రకటించారు. ఆదివారం ఐదు జిల్లాల్లో బహిరంగ సభలు జరగ్గా, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని… అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయిలో బహిరంగ సభులు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. మంగళవారం మరో మూడు జిల్లాలో బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. ఈ మూడు సభలకూ అగ్రనేతలు హాజరవుతున్నారు. అనంతపురంలో కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రిలో సోము వీర్రాజులు, అరకులో దగ్గుబాటి పురంధరేశ్వరి సభల్లో పాల్గొంటారు.

అనూహ్య ప్రజా స్పందనతో ఉత్సాహంలో బీజేపీ నేతలు

భారతీయ జనతా పార్టీ నేతలు ప్రజా స్పందనతో ఉత్సాహంగా ఉన్నారు. సభలకు పెద్దగా స్పందన లేకపోతే పార్టీ ముఖ్య నేతలైనా హాజరయ్యేందుకు నిరుత్సహం చూపిస్తారు. ఏదో ఓ కారణం చూపి తప్పించుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం జిల్లాల సభలకు ఠంచన్ గా హాజరవుతున్నారు. ఇతర ప్రాంతీయపార్టీల్లా.. బీజేపీ జన సమీకరణ చేయదు. స్వచ్చందంగా వచ్చే పార్టీ కార్యకర్తలు.. బీజేపీ సందేశాన్ని వినాలనుకునే ప్రజలే వస్తారు. ఇలాంటి స్పందనతో వెయ్యి మంది వచ్చినా పదివేల మందితో సమానం అని .. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి స్పందన బీజేపీకి ఉండటంతో ఆ పార్టీ నేతలు మరింత ఉత్సాహం గా ఉన్నారు.

వరుసగా ప్రజల్లో ఉండటంతో పెరుగుతున్న నమ్మకం

ఏపీ బీజేపీ గత మూడేళ్లుగా వరుసగా ఏదో ఓ ప్రజా సంబంధ కార్యక్రమం పెట్టి వారి కోసం పోరాడుతూనే ఉంది. సమస్యలపై ఎప్పటికప్పుడు చేసే పోరాటంతో పాటు… ఏడు వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. తర్వాత చార్జిషీట్ కార్యక్రమం చేశారు. ఇప్పుడు అగ్రనేతలతో సహా దిగువ స్థాయి వరకూ అందరూ కదిలి ఇంటింటికి వెళ్లి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల కలుగుతున్న మేళ్లను వివరిస్తున్నారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉండటంతో… ప్రజల్లో కూడా బీజేపీ పేరు నానుతోంది. నేతలంతా కష్టపడుతున్నందున ఆ పార్టీకి మంచి ఆదరణ ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి.