వైసీపీ నాయకులకు ఢిల్లీలో పని ఉండదు. పార్లమెంటరీ పార్టీ నేతకు కూడా పార్లమెంట్ సమవేశాలు ఉంటే తప్ప ఢిల్లీకి వెళ్లరు. మొదట్లోనే వైసీపీ హైకమాండ్ ఓ నిబంధన కూడా పెట్టింది. పార్టీ పెద్దలకు తెలియకుండా ఎవరూ కేంద్ర మంత్రుల్ని.. బీజేపీ నేతలను కలవకూడదని రూల్ పెట్టింది. అలా కలిశారనే రఘురామకృష్ణరాజుపై అనుమానం పెంచుకున్నారు. అయితే అసలు ఎంపీ కాకుండా రాష్ట్ర మంత్రి వర్గంలో ఉన్న ఓ కీలక నేత ఇటీవలి కాలంలో ఢిల్లీలో సంప్రదింపులు జరుపుతున్నారుని ప్రచారం జోరుగుతోంది. ఆ కీలక నేత ఎవరు.. ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారన్నది వైసీపీలో హాట్ టాపిక్ అవుతోంది.
తరచూ ఢిల్లీ వెళ్తున్న వైసీపీ మంత్రి
వైసీపీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. తమది ముఖ్యమంత్రి రేంజ్ అని చెప్పుకున్నవారు ఓ సందర్భంగా మరో జాతీయ పార్టీలో ఉండి…. ఆ పొజిషన్ కోసం ప్రయత్నించిన వారు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు . కానీ వారెవరికీ విలువ లేదు. చెప్పింది మీడియా ముందు మాట్లాడటం తప్ప ఏమీ చేయలేరు. కనీసం తమ సొంత శాఖ సమీక్ష కూడా పెట్టలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మంత్రి… తన వర్గం మొత్తం తీసుకుని బయటకు వెళ్లిపోవాలని అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే మరో జాతీయ పార్టీతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. నిజానికి ఆయనకు హిందీ, ఇంగ్లిష్ పెద్దగా రావు. అందుకే కుటుంబసభ్యులను తీసుకెళ్లి చర్చలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.
పేరుకు మంత్రే .. సీనియరే కానీ కనీస ప్రాధాన్యం కూడా కరవు
ప్రభుత్వంలో తమకు గుర్తింపు లేకపోవడంతో పాటు.. ఈ ప్రభుత్వంలో జరిగిన జరిగిన కొన్ని అవకతవకలు.. ప్రభుత్వం మారితే తన మెడకు చుట్టుకుంటాయన్న భయంలో ఆయన ఉన్నారని చెబుతున్నారు. నిజానికి నిధుల కొరతతో… ఆ మంత్రి శాఖలోనే పనులు కావడం లేదు. ఓ వైపు ఎన్నికలు ఎదుర్కోవడనికి కావాల్సినంత ఆర్థిక సాయం సమకూర్చుకోవడం.. కష్టమవడం.. మరో వైపు వైసీపీ పెద్దలు అందర్నీ దూరం చేసుకుంటూండటంతో కొత్తగా ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఆ రాజకీయ నేత సీజన్డ్ పొలిటిషియన్… ఆయన దృష్టిలో సీజన్డ్ పొలిటిషియన్ అంటే… సీజన్ ను బట్టి పార్టీ మారిపోవడమే. ఇప్పుడు అదే ప్రయత్నాల్లో ఉన్నారని చెబుతున్నారు.
కొన్ని రోజుల్లో కీలక పరిణామాలుంటాయా ?
ఇటీవలి కాలంలో ఏపీ అధికార పార్టీలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఆ పార్టీ సీనియర్లు కొంత మంది జాతీయపార్టీల వైపు చూస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ పాలన నిర్వహించిన తీరుతో.. ఒక వేళ ప్రభుత్వం మారితే.. తమ ఆర్థిక పునాదుల్ని కూల్చివేయడానికి వచ్చే ప్రభుత్వంలోని వారు వెనుకాడరన్న ఆందోళన ఎక్కువ మందిలో ఉంది. ఇలాంటి వాటి నుంచి కనీస రక్షణ పొందాల్సిన అవసరం అయినా వారికి ఏర్పడుతోందని అంటున్నారు. అందుకే రహస్య చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది.