ఏపీలో ప్రభుత్వ ప్రాయోజిత గనుల మాఫియా – కీలక విషయాలు బయటపెట్టిన విష్ణువర్ధన్ రెడ్డి

దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా జరగని వింత వింత నిర్ణయాలను ఏపీ ప్రభుత్వం తీసుకుంటోంది. పన్నుల వసూళ్లు ప్రభుత్వం విధి. ఆ పన్నులను నెలకు ఇంత అని మాకు కట్టండి.. మీరు ఎంత కావాలంటే అంత వసూలు చేసుకోండి ప్రైవేటు వ్యక్తులకు ఏ ప్రభుత్వమైన అధికారం ఇచ్చేస్తుందా ? చాన్సే ఉండదు. కానీ ఏపీ ప్రభుత్వం ఇస్తుంది. ఈ వివరాలను ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. విజయవాడలోని బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన విషయాలు వెల్లించారు.

వనరుల దోపిడీలో బరితెగిస్తున్న వైసీపీ

ఏ ప్రభుత్వం అయినా భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని వనరులను ఉపయోగిస్తారు కానీ.. ఎపీలో మాత్రం ప్రకృతి వనరులను కూడా దోచేస్తూ.. కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇసుక, కంకర, గ్రానైట్, ఇతర ముడి గనులకు సంబంధించిన సీవరేజీ వసూళ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారన్నారు. చిత్తూరు, అనంతపురం , శ్రీకాకుళం , గోదావరి జిల్లలో వనరులు దోపిడీ చేసేవారికి ఈ వసూళ్ల బాధ్యతలు అప్పగించారన్నారు. దొంగ చేతికి తాళం ఎలా ఇవ్వాలో జగన్ ప్రభుత్వం చేసి చూపించిందని మండిపడ్డారు.

అధికారులను ఎందుకు పక్కన పెట్టారు ?

ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడే శక్తి, హక్కు ప్రభుత్వ అధికారులకే ఉంటుంది. లోపాలు ఉంటే.. చట్టబద్దంగా వారు చర్యలు తీసుకునే వీలుంటుంది ఇక్కడ వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రైవేటు వ్యక్తులకు సీవరేజీ వసూలు కాంట్రాక్టులకు జిల్లాల వారీగా అమ్మేశారు. వాళ్లే రిసిప్ట్ ఇస్తారు.. డబ్బులు వసూళ్లు చేస్తారు.. తర్వాత ప్రభుత్వానికి సొమ్ములు చెల్లిస్తారు. ఒక జిల్లాలో ఏడు కోట్లు వసూళ్లు అంచనా అయితే.. ముందే ప్రభుత్వం కట్టించుకునేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఈ కాంట్రాక్టులు పొందిన వారు రౌడీషీటర్లను, వీధి రౌడీలను నియమించుకుని వారి ద్వారా నిలబెట్టి వసూళ్లు చేస్తున్నారు. కొన్ని కాంట్రాక్టు సంస్థలు బినామీ పేర్లతో టెండర్లు వేసుకుని వనరులు దోపిడీ చేసి అమ్మేస్తున్నారు. నెలకు ఓక్కో జిల్లాలో ప్రభుత్వానికి చెల్లించేది పది కోట్లు అయితే.. కాంట్రాక్టర్లు యాభై కోట్లు అనధికారంగా నేరుగా వనరులే అమ్మేసి దోచుకుంటున్నారు. ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందా ? దొంగ చేతికి తాళం ఎలా ఇవ్వాలో జగన్ ప్రభుత్వం నేడు రాష్ట్రంలో వనరుల దోపిడీ విషయంలో చేసి చూపించిందని బీజేపీ నేత మమండిపడ్డారు.

ఇసుకపై వేల కోట్ల దోపిడీ నిజం కాదా ?

ఇసుక విషయంలో 700కోట్లు ప్రభుత్వానికి చెల్లించి, 7వేల కోట్లు కాంట్రాక్టు సంస్థ దోచుకుంది వాస్తవం కాదా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఎపీలో ఇసుక అమ్మకుండా.. ఇతర రాష్ట్రాలకు దర్జాగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని.. వైసీపీ ప్రభుత్వంలో ఇది నయా దోపిడీ అనేది వాస్తవమన్నారు. ఈ దోపిడీ ఇతర జిల్లాలకు విస్తరించకుండా ముందే నిరోధించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అసలు ఈ కాంట్రాక్టు కంపెనీ వెనుక ఉన్న పెద్దవాళ్లు ఎవరో చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రస్నించారు. ఈ విషయాలలో అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాటం చేస్తామని ప్రకటించారు. జగన్ ప్రభుత్వం నాలుగు ఇసుక విధానాలను మార్చి.. తమకు అనుకూలంగా మార్చుకున్నారని మమండిపడ్డారు.

వనరులను కాపాడాల్సిన ప్రభుత్వమే వనరులను దోపిడీ చేయడం చాలా దుర్మార్గం.. లోప భూయిష్ట విధానాలపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.