ద్యావుడా..చెరుకురసంతో కూడా అనారోగ్య సమస్యలా!

అతి సర్వత్ర వర్జయేత్.. అంటే ఏ విషయంలోనూ అతి పనికిరాదని అర్థం. అలాగే ఆహారం విషయంలో కూడా. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కదా అని ఏదైనా అతిగా తింటే దానివల్ల కలిగే అనర్థాలు కూడా అలాగే ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి, నిత్యం అందరికీ అందుబాటులో ఉండేది చెరుకురసం.

చెరుకురసం అంటే చాలామందికి ఇష్టం. అందులో సహజంగా ఉండే తీపి మళ్లీ మళ్లీ దానివైపు ఆకర్షిస్తుంది. అందుకే గ్లాసుల మీద గ్లాసులు ఎక్కించేసేవారూ ఉన్నారు. నిత్యం అదే పనిగా తాగేవారూ ఉన్నారు. వాస్తవానికి చెరుకురసంలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి. ఈ చక్కెర అధికంగా ఉండే పానీయం హైడ్రేట్‌గా ఉంచుతుంది. ముఖ్యంగా మండే ఎండల్లో చెరుకురసం తాగడం వల్ల శరీరానికి బలం వస్తుంది. అయితే ఏదైనా మితంగానే అన్న విషయం మరిచిపోరాదు. అతిగా తాగితే చాలా దుష్ఫలితాలను కలిగిస్తుంది.

చెరకు అధిక క్యాలరీలు
చెరకు క్యాలరీలతో నిండి ఉంటుంది. 100 గ్రాముల చక్కెరలో దాదాపు 270 కేలరీలు ఉంటాయి. అందుకే రోజుకు ఒక గ్లాసు మాత్రమే చెరుకు రసం తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.అతిగా తాగితే ఊబకాయం, షుగర్ లెవెల్స్ రెండూ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

నిద్రలేమి
చెరకు రసంలో పొలికోసనాల్ ఉంటుంది. ఈ సమ్మేళనం శరీరంలో తేలికపాటి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల వెర్టిగో, నిద్రలేమి, లూజ్ మోషన్స్‌కు కారణమవుతుంది.

రక్తాన్ని పలుచగా చేస్తుంది
చెరకు రసంలో ఉండే పోలికోసనాల్ రక్తాన్ని పలుచగా చేస్తుంది. అందువల్ల రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. అది అధికమైనతే శరీరంలో అధిక స్రావానికి దారితీస్తుంది. ఇప్పటికే రక్తం పలచబడేందుకు ఔషధం తీసుకునే వారు చెరుకు రసం తీసుకోపోవడమే మంచిది.

నిలవ ఉంచితే విషమే
చెరుకు రసం తీసే బండి దగ్గరే ఉండి తీసిన వెంటనే తాగేస్తే పర్వాలేదు కానీ బాటిల్స్ లో నింపి ఇంటికి తీసుకొచ్చి గంటల తరబడి ఫ్రిడ్జ్ లో ఉంచి అస్సలు తాగకూడదు. ఎందుకంటే చెరుకురసం త్వరగా విషపూరితం అవుతుంది. సాధారణంగా చెరకు 20 నిమిషాల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచినప్పుడు ఆక్సీకరణం చెందుతుంది ఇది శరీరానికి చాలా హానికరం.

అంటువ్యాధులొచ్చే ప్రమాదం
చెరుకు అమ్మేవారు యంత్రాన్ని సరిగా శుభ్రం చేయకపోయినా, రసం తీసి వడగట్టేప్పుడు ఈగలు ముసిరినా దీనితో అనేక అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే చెరుకురసం తాగితే మంచిదని ఎక్కడంటే అక్కడ కాదు..పరిశుభ్రంగా ఉండే వాతావరణంలోనే చెరుకురసం తాగాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…