రాజకీయ సంస్కృతి దిగజారుతోంది. నేతలు, కార్యకర్తల మాటలు లక్ష్మణ రేఖ దాటుతున్నాయి. మంచి చెడు, పెద్దా చిన్నా, ఆడ మగ తేడా లేకుండా అశ్లీల, అభ్యంతరకర కామెంట్స్ బయటకు వస్తున్నాయి. ఆ మాటలు వింటే పార్టీలేమో గానీ, సభ్యసమాజం కూడా తలదించుకోక తప్పడం లేదు. తాజాగా తమిళనాడు అధికార పార్టీ డీఎంకే విషయంలో జరిగింది కూడా అదే. ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన ద్రవిడ ఉద్యమానికి మాతృక అయిన పార్టీలో నేతల దిగజారుడు మాటలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
నోటికొట్టినట్లు మాట్లాడే శివాజీ కృష్ణమూర్తి
శివాజీ కృష్ణమూర్తి అనే డీఎంకే కార్యకర్త ఎంత మాట అంటే అంత మాట మాట్లాడతారు. గతంలో ఆయన తమిళనాడు గవర్నర్ రవి పట్ల భారతీయులు సహించలేని వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి గవర్నర్ సహకరించలేని పక్షంలో ఆయన కశ్మీర్ వెళ్లిపోవచ్చన్నారు. అప్పుడు తాము ఉగ్రవాదులను పంపి గవర్నర్ రవిని తుదముట్టించే చర్యలు చేపడతామన్నారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పార్టీ అధినేత స్టాలిన్ కు చేరడంతో ఆయన్ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కొంతకాలం తర్వాత శివాజీ కృష్ణమూర్తి క్షమాపణ చెప్పి సస్సెన్షన్ నుంచి బయట పడ్డారు.
ఖుష్బూపై అశ్లీల కామెంట్స్
నటి, డీఎంకే నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు సుందర్ పై శివాజీ కృష్ణమూర్తి చెప్పడానికి వీలులేని కామెంట్స్ చేశారు. అవి వైరల్ కావడంతో డీఎంకే డిఫెన్స్ లో పడిపోక తప్పలేరు. ఆ కామెంట్స్ ను నేరుగా సీఎం స్టాలిన్ కే ట్యాగ్ చేసిన ఖుష్బూ…సభ్యతా సంస్కారాలు లోపించాయని సమాజంలో మహిళలను గౌరవించడం మానేశారని నిలదీశారు. జాతీయ మహిళా కమిషన్ కు సుమోటోగా ఈ అంశాన్ని పరిశీలిస్తుందని చెప్పారు. బీజేపీ తమిళనాడు శాఖాధ్యక్షుడు అన్నామలై కూడా శివాజీ కృష్ణమూర్తి తీరుపై మండిపడ్డారు.
కృష్ణమూర్తి అరెస్టు
మొత్తం వ్యవహారం స్టాలిన్ దృష్టికి వెళ్లడంతో కృష్ణమూర్తిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఆదేశించారు. సాయంత్రానికి ఆయన్ను అరెస్టు చేశారు. ఇక్కడ మరో విషయం చర్చకు రాక తప్పదు. రాజకీయాల్లో మహిళలను చిన్న చూపు చూస్తున్నారని, వారిని కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే పరిగణిస్తున్నారని చాలా కాలంగా వినిపిస్తున్న ఆరోపణలు నిజమని మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే శివాజీ కృష్ణమూర్తి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను డీఎంకే పెద్దలు వినీ విననట్లుగానే ఊరుకున్నారు. ఖుష్బూ విమర్శలు మొదలు పెట్టిన తర్వాతే కృష్ణమూర్తిని అరెస్టు చేశారు. అంటే ఎవరూ అడగకపోతే ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చా అన్నదే ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. పైగా ద్రవిడ పార్టీల నేతలు, కార్యకర్తల భాష కట్టుతప్పుతోందని చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. అయినా అగ్రనేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు.