అమెరికాలో హిందువుల ప్రయోజనాలను కాపాడే కాకస్

అమెరికా సంయుక్త రాష్ట్రాల పురోగతిలో భారతీయుల చేయూత ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. దేశ జనాభాలో ఒక శాతం ఉన్న భారతీయులు, పన్ను చెల్లింపులో మాత్రం ఆరు శాతం ఉన్నారు. అమెరికాలో ఉండే ప్రతీ ఐదుగురు వైద్యుల్లో ఒకరు భారతీయులు అని చెప్పడానికి వెనుకాడాల్సిన పనిలేదు. అమెరికా సాఫ్ట్ వేర్ రంగాన్ని అగ్రగామిగా నిలబెట్టినది కూడా భారతీయులే.. భారత – అమెరికన్ సమాజాన్ని అమెరికా ప్రభుత్వమూ, అక్కడి చట్టసభల సభ్యులు నిత్యం ప్రశంసిస్తూనే ఉంటారు. అయినా వారిలో ఏదో వెలితి కనిపిస్తూనే ఉంది.

హిందువుల ప్రయోజనాలకు ఇబ్బందులు

భారతీయ అమెరికన్లలో హిందువులే ఎక్కువగా ఉంటారు. శాంతికాములైన హిందువులు తమ మత విశ్వాసాలను కాపాడుకుంటూ ఆలయాల్లో పూజలు చేస్తూ వృత్తిలో రాణిస్తున్నారు. కాకపోతే హిందువుల ప్రయోజనాలకు, వారి మత సంస్థలను ధ్వంసం చేసేందుకు కొందరు ఉన్మాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారని ప్రతీ ఏటా గణాంకాలు చెబుతున్నాయి. అక్కడ 30 లక్షల మంది హిందూ అమెరికన్లు ఉంటే.. వారికి ఏదో విధమైన ఇబ్బంది కలుగుతూనే ఉంది. న్యూ జెర్సీ రాష్ట్ర జనాభాలో మూడు శాతం మంది హిందువులున్నారు. యూఎస్ఏ మొత్తం మీద వెయ్యి హిందూ దేవాలయాలున్నాయ్

హిందువులపై దాడులు

అమెరికాలో హిందువులు స్థిరపడటం మొదలై వందేళ్లు దాటింది. గత నాలుగు దశాబ్దాలుగా అక్కడ హిందువులపైనా, హిందూ మత సంస్థలపైనా దాడులు పెరిగాయి. 1987లో హిందువులపై దాడులు చేయాలంటా ఒక పత్రిక ప్రచారం మొదలు పెట్టింది. తర్వాతి కాలంలో డాట్ బస్టర్ గ్రూప్ పేరుతో తరచూ దాడులు జరిగేవి. 2001 సెప్టెంబరు 11 ఉగ్రదాడుల తర్వాత హిందువులను కూడా ఉగ్రవాదులుగా అనుమానిస్తూ హింసాత్మక ఘటనలు జరిగాయి. 2019లో కెంటుకీలోని హిందూ దేవాలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.

యూఎస్ కేపిటల్ లో హిందూ అమెరికన్ సమ్మిట్

ఇటీవల తొలి సారిగా హిందూ అమెరికన్ సమ్మిట్ నిర్వహించారు. దీన్ని అమెరికన్ హిందూస్ సంస్థ నిర్వహించగా….మరో 20 సంస్థలు సహకరించాయి. రాజకీయంగా హిందువుల హక్కుల కోసం కూడా ఈ సమ్మిట్ ను నిర్వహించారు. రాజకీయంగా హిందూ అమెరికన్లు వివక్షకు గురవుతున్నారన్న అభిప్రాయంతోనే అందరినీ సంఘటిత పరిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

కాకస్ ఏర్పాటుకు సన్నాహాలు

అమెరికాలో హిందువుల ప్రయోజనాలు కాపాడే నిమిత్తం చట్టసభ అయిన కాంగ్రెస్‌లో ‘కాకస్‌’ ఏర్పాటు కానుంది. హిందూ కాకస్‌ ఏర్పాటు చేయడానికి తాను ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇండియన్‌-అమెరికన్‌ కాంగ్రెస్‌మేన్‌ శ్రీ ఠాణేదార్‌ తెలిపారు. ఆయన మిషిగాన్‌లోని 13వ డిస్ట్రిక్ట్‌కు డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలిసారిగా జరిగిన ప్రథమ హిందూ అమెరికన్‌ సమ్మిట్‌లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఒకే తరహా అభిప్రాయాలు ఉన్న కాంగ్రెస్‌ సభ్యులను కలుపుకొని బృందంగా ఏర్పడడాన్నే కాకస్ గా పరిగణిస్తారు. ఇకపై హిందువుల ప్రయోజనాలకు భంగం కలగుకుండా చూస్తామని ఆయన అన్నారు..