హైదరాబాద్ రెండో రాజధాని – తెలంగాణపై బీజేపీ వ్యూహానికి బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి ?

తెలంగాణలో అధికారం చేపట్టడానికి అన్ని రకాలుగా వ్యూహాలను ఖరారు చేసుకుంటున్న బీజేపీ.. హైదరాబాద్ రెండో రాజధానిగా చేయాలన్న అంశాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టింది. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలన్నారు. అంబేద్కర్ కూడా అదే కోరుకున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై పార్టీలన్నీ ఆలోచించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగినప్పుడు సీఎం కేసీఆర్ సమక్షంలోనే అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్.. హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయడం అంబేద్కర్ స్వప్నమన్నారు.

తరచూ చర్చల్లోకి వస్తున్న రెండో రాజధాని !

దక్షిణాదిన రెండో రాజధాని ఉండాలన్న ప్రస్తావన చాలా రోజులుగా వస్తున్నదే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వాతంత్రోద్యమ కాలంలోనే ఈ మాట చెప్పారన్న ప్రచారం ఉంది. హైదరాబాద్ ను సెకెండ్ కేపిటల్ చేయాలంటూ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకం 11వ అధ్యాయంలో అంబేడ్కర్ రాశారు. ఈ పుస్తకం 1955లో ప్రచురితమైనప్పుడు జనం అంబేడ్కర్ వాదనతో ఏకీభవించారని.. అయినా అది కార్యరూపానికి నోచుకోలేదని చెబుతారు. తర్వాత ఆ అంశం మరుగున పడిపోయింది. ఇటీవలి కాలంలో మారిపోతున్న రాజకీయ ప్రాధాన్యలతో ఉత్తర దక్షిణ తారతమ్యాలను పోగొట్టేందుకు సెకెండ్ కేపిటల్ ఒకటి కావాలన్న అభిప్రాయం చాలా రోజులుగా ఉంది.

ప్రజల అభిప్రాయమూ అదే !

నిజంగానే బీజేపీ.. రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేస్తామంటే.. స్వాగతించేవారు ఎక్కువగా ఉంటారు. కానీ బీఆర్ఎస్ వ్యతిరేకించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇతర పార్టీలు కూడా.. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి.. రెండో రాజధానిని చేస్తామంటే అంగీకరించే అవకాశం ఉండదు. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి సెకెండ్ కేపిటల్ గా ప్రకటించాలన్న ప్రతిపాదన చాలా రోజులుగా ఉన్నదే. బీజేపీ ఆ దిశగా ఆలోచిస్తే బావుంటుందన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. మోదీ అమిత్ షా అనుకుంటే ఆ పని చేయగలరన్న విశ్వాసమూ అందరికీ ఉంది. ఇది బీజేపీకి తెలంగాణలో మరింత ఆదరణ పెరగడానికి కారణం అవుతుంది.

వ్యతిరేకిస్తే తెలంగాణకు బీఆర్ఎస్ ద్రోహం చేసినట్లే !

ఢిల్లీ రాజధాని వత్తిడి పెరుగుతూనే ఉంది. అందుకే సెకెండ్ కేపిటల్ కావాలన్న డిమాండ్ పెరుగుతోంది. దక్షిణాదిన సౌతిండియాలో ఒక కేపిటల్ ఏర్పాటు చేయాలన ప్రస్తావన వచ్చినప్పుడు రెండు మూడు నగరాల పేర్లు తెరపైకి వచ్చాయి. హైదరాబాద్ తో పాటు బెంగళూరు చెన్నై మహానగరాల పేర్లు కూడా వినిపించాయి. అయితే వాతావరణ సమతౌల్యత విషయంలో అందరూ హైదరాబాద్ కే మొగ్గు కనిపించింది. ల్యాండ్ లాక్డ్ ప్రదేశమైన హైదరాబాద్ కు సెక్యూరిటీ రిస్క్ లేదు. ఏ నగరంతో పోల్చుకున్నా భద్రతలో హైదరాబాద్ కు సాటి లేదు. అయితే రాజకీయ కారణాల కోసం బీఆర్ఎస్ వ్యతిరేకిస్తే.. హైదరాబాద్ అభివృద్ధిని వ్యతిరేకించినట్లేనన్న విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది.