ఏపీ బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి చేరిన తర్వా త రాజకీయాలు మారిపోతున్నాయి. చాప కిందనీరులా చేరికల కోసం… కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. తన కేబినెట్ లో మంత్రిగా పని చేసిన విశాఖ జిల్లాకు చెందిన పసుపులేటి బాలరాజు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమయింది. ఇటీవల బాలరాజు కిరణ్ ను కలిసి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపించారు. హైకమాండ్ తో మాట్లాడిన కిరణ్ లైన్ క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం వైసీపీలో ఉన్న బాలరాజు
కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా చేసిన బాలరాజు.. తర్వాత జనసేన పార్టీలో చేరారు. కానీ ఘోరపరాజయం ఎదురు కావడంతో 2019 ఎన్నికల తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనతో పాటూ మరికొందరు కూడా కండువాలు కప్పుకున్నారు. బాలరాజు 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి చేతిలో ఓడిపోయారు. అయితే వైసీపీలో చేరారనే కానీ.. ఆయనను అక్కడ పట్టించుకున్న వారు లేరు. దీంతో ఆయన .. రాజకీయ భవిష్యత్ బాగుంటుందని బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
పార్టీ మారుతారని కొంత కాలంగా ప్రచారం
బాలరాజు పార్టీ మారతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేస్తే ఏ పార్టీలోకి వెళ్తారన్న విషయంపైనా కొద్దికాలం చర్చ నడిచింది. చివరికి బీజేపీలో చేరాలని నిర్ణయిచుకున్నారు. పసుపులేటి బాలరాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. అంతేకాదు వైఎస్‌కు సన్నిహితుడిగా పేరుంది.. గిరిజన వర్గాల్లో పట్టున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న బాలరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో అప్పటి చింతపల్లి నియోజవర్గం నుంచి గెలిచి పేరు తెచ్చుకున్నారు. అనంతరం 2009లో పాడేరు నుంచి విజయం సాధించి వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
గిరిజన ప్రాంతాల్లో బీజేపీ మరింత బలోపేతం
గిరిజన ప్రాంతాల్లో బీజేపీ మరింత బలోపేతం కావడానికి బాలరాజు చేరిక దోహదపడుతుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉన్నా లేకపోయినా… పాడేరు, అరకు లాంటి చోట్ల బీజేపీ బలమైన ప్రత్యర్థిగా నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో గిరిజన వర్గాల నుంచి భారీగా చేరికలు ఉంటున్నాయి.