ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు మానిటైజేషన్‌కు కావాల్సిన సబ్ స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గించింది. చిన్న కంటెట్ క్రియేటర్లు సైతం మానిటైజేషన్ ను పొందేందుకు అనుకూలంగా నిబంధనలను సరళీకరించింది. ఈ నిర్ణయంతో తక్కువ సబ్ స్క్రైబర్ల ఉన్న క్రియేటర్లు సైతం యూట్యూబ్ ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది.
500 మంది సబ్ స్క్రైబర్లు మానిటైజేషన్
ఇప్పటి వరకు మానిటైజేషన్ సాధించాలంటే తక్కువలో తక్కువగా 1000 మంది సబ్ స్క్రైబర్లు ఉండాలి. అంతేకాదు, ఏడాది కాలంలో కనీసం 4 వేల గంటల వ్యూస్ ఉండాలి. అదీ కాదంటే, చివరి మూడు నెలల్లో కనీసం 10 మిలియన్ షార్ట్స్ వీడియో వ్యూస్ ను కలిగి ఉండాలి. ఈ నిబంధనలతో చాలా మంది చిన్న కంటెంట్ క్రియేటర్లు మానటైజేషన్ రాక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ మానటైజేషన్ నిబంధనలు సరళతరం చేసింది. యూట్యూబ్ తాజాగా తీసుకొచ్చిన నూతన మానిటైజేషన్ నిబంధనల ప్రకారం, ఇకపై 500 మంది సబ్ స్క్రైబర్లు ఉంటే మానిటైజేషన్ కు అర్హత పొందే అవకాశం ఉంటుంది. చివరి మూడు నెలల వ్యవధిలో తక్కువలో తక్కువగా మూడు వీడియోలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు ఏడాది కాలంలో 3 వేల గంటల వ్యూస్ లేదంటే, చివరి మూడు నెలల్లో 3 మిలియన్ల షార్ట్ వీడియోస్ వ్యూస్ పొంది ఉండాలి. ఈ నిబంధనలతో చిన్న కంటెట్ క్రియేటర్లు కూడా మానిటైజేషన్ పొందే అవకాశం ఉంటుంది.
మన దేశంలో అమలుకి ఇంకా టైముంది!
తాజాగా తీసుకొచ్చిన సరళీకరణ నిబంధనలను తొలుత అమెరికాతో పాటు బ్రిటన్, కెనడా, తైవాన్, దక్షిణ కొరియాలో అమలు చేయనున్నట్లు యూట్యూబ్ వెల్లడించింది. ఆ తర్వాత మిగిలిన దేశాలకు విస్తరించనున్నట్లు తెలిపింది. భారత్ లో ఎప్పుడు ఈ నిబంధనలు అమలు అవుతాయి అనే విషయం మీద కంపెనీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, భారత్ లో వీలైనంత త్వరగా వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల కారణంగా చిన్న క్రియేటర్లకు మేలు జరగనుంది. యూట్యూబ్ ద్వారా ఆదాయాన్ని గడించే అవకాశం ఉంది. అంటే యూట్యూబ్ లో కంటెంట్ మరింత పెరిగే అవకాశం ఉంది. అటు సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ వంటి టిప్పింగ్ టూల్స్ తో పాటు ఛానెల్ మెంబర్ షిప్స్ వంటి సబ్ స్క్రిప్షన్ టూల్స్ ను సైతం పొందే అవకాశం ఉన్నట్లు యూట్యూబ్ వెల్లడించింది.