పది రోజుల పాటు పడమటి తీరాన్ని వణికించిన బిపర్జోయ్ ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్లో తీరాన్ని దాటింది. అతి తీవ్రం నుంచి తీవ్ర తపానుగా బలహీనపడింది. కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించినట్లే కనిపించినా… కేంద్రప్రభుత్వం, గుజరాత్ సర్కారు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సత్వర చర్యల కారణంగా నష్టాన్ని అరికట్టగలిగారు. చాలా తక్కువ స్థాయిలో నష్టం సంభవించింది..
మరణాలు దాదాపుగా శూన్యం
తుపాను అంటే వందల మంది చనిపోతారన్న భయం ఒకప్పుడు వెంటాడేది. ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికతో బీజేపీ ప్రభుత్వాలు ముందు నుంచే సహాయ చర్యలు చేపట్టి.. ప్రాణ నష్టం లేకుండా చూసుకున్నాయి. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గుజరాత్లో తుపాను ధాటికి ముగ్గురు చనిపోయారంతే. ప్రాణనష్టాన్ని నివేరించే దిశగా గుజరాత్ బీజేపీ సర్కారు ఎక్కడిక్కడ రవాణా సాధనాలను ఆపేసింది. వంద రైళ్లను రద్దు చేయడంతో పాటు… తుపాను తీరం దాటే ప్రాంతం వైపుకు రాకుండా 40 రైళ్లను పరిమితం చేసింది.
విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు
తుపాను తీరం దాటిన తర్వాత లెక్కలు చూసుకుంటే 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు లెక్క తేల్చారు. అక్కడ పునరుద్ధరణ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. తుపానుకు రెండు రోజుల ముందు నుంచి 18 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్, 115 రోడ్లు భవనాల బృందాలు, 397 విద్యుత్ శాఖ సహాయ బృందాలు రంగంలోకి దిగాయు మరో నాలుగు రోజులు తమకు నిర్దేశించిన ప్రదేశాల్లోనే ఉంటూ వాళ్లు సహాయ చర్యలను ఒక కొలిక్కి తీసుకువస్తారు. నేలకూలిన 600 మహావృక్షాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చేశారు. ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు ఫోన్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని రప్పించుకుంటున్నారు.
గిర్ సింహాలను కాపాడిన అదికారులు
తుపాను కారణంగా గుజరాత్ లోని సింహాల సంతతికి ప్రమాదం ఏర్పడుతుందని అనుమానించారు.వాటి కదలికకు, మనుగడకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. తుపాను వార్త తెలియగానే 184 అటవీ శాఖ బృందాలు కార్యాచరణకు దిగాయి. 58 కంట్రోల్ రూమ్స్ ద్వారా సింహాల కదలికను గమనిస్తూ వాటిని సురక్షిత ప్రదేశాలకు తరలించాయి. గిర్ అడవులతో పాటు, తీర ప్రాంతంలో 40 సింహాలున్నట్లు రేడియో కాలరింగ్ టెక్నాలజీ ద్వారా గుర్తించి వాటిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. తుపానులో కూడా 13 స్పెషల్ ఆపరేషన్స్ టీమ్స్ రంగంలో ఉన్నాయి. దానితో ఒక్క సింహానికి కూడా ఎలాంటి ఇబ్బందీ కలగలేదు.
బలహీనపడిన తుపాను
తుపాన్ ఇప్పుడు బలహీనపడింది. గుజరాత్, రాజస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో బిపర్జోయ్ తుపాను పాకిస్థాన్లోని కరాచీ వైపు పయనిస్తుందని చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి..