తెలుగుదేశం పార్టీ ఫేస్ టర్నింగ్ పాలిటిక్స్ కు అంతే లేకుండా పోతోందన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. బీజేపీ అగ్రనేతలతో భేటీల కోసం ఢిల్లీలో ఆ పార్టీ నేతలు పడిగాపులు పడతారు. చివరికి చంద్రబాబు కూడా అమిత్ షా భేటీ కోసం పరుగులు పెడతారు. కానీ ఏపీకి వచ్చిన తర్వాత మాత్రం.. భిన్నంగా మాట్లాడుతూ ఉంటారు. అంతే బీజేపీ నే చేస్తుందన్నట్లుగా.. ఆ పార్టీ మీద నిందలేయడానికి ప్రయత్నిస్తున్నారు. అమిత్ షా, నడ్డా టూర్ల తర్వాత చంద్రబాబు, అచ్చెన్నాయుడు బీజేపీపై విమర్శలు చేయడం వారి రాజకీయ నైజాన్ని బట్టబయలు చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఆర్థిక సాయం ఆపేయడం అంటే ఏమిటి ?
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆర్థిక సాయం చేస్తోందని దాన్ని ఆపేయాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారని వారి మాటలను బట్టి అర్థమవుతోంది. కేంద్రం ఏపీకి ఇంకా ఎందుకు ఆర్థిక సాయం చేస్తున్నారని అచ్చెన్నాయుడు, చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. నిజానికి.. పన్నుల్లో వాటాలు ఇవ్వడం కూడా సాయం ఎలా అవుతుందనే అంశాన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వారికి ఎలా తెలియదని ఎలా అనుకుంటాం. భారత రాజ్యాంగం… నిధులను రాష్ట్రాలకు పంపిణీ చేసే విధానాన్ని పెట్టింది. ఆ ప్రకారమే నిధులు రాష్ట్రాలకు కేటాయిస్తారు. వాటిని ఆపడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ఇప్పుడు రాజ్యాంగాన్ని కేంద్రం ఉల్లంఘించాలని టీడీపీ కోరుకుంటోంది.
వైసీపీ, బీజేపీ ఒకటేనని ముద్ర వేసేందుకు టీడీపీ కుట్రలు !
కేంద్రమంత్రి నరేంద్రమోదీ , బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రభుత్వం అవినీతి మయం అయిందని ఆరోపించారు. విశాఖలో శాంతి భద్రతలు లేవన్నారు. అది నిజమేనని ఎంపీ కిడ్నాప్ ఉదంతంతో బయటపడింది. బీజేపీ అగ్రనేతలు ఇలా విమర్శలు చేయగానే అలా .. మరి చర్యలు ఎప్పుడు తీసుకుంటారని … ప్రశ్నించడం ప్రారంభించారు. అది ఎలా ఉందంటే.. చర్యలు తీసుకోకపోతే.. బీజేపీ, వైసీపీ ఒక్కటేనని చెప్పుడానికి ఈ తరహాలో కొత్త పద్దతిలో ప్రయత్నిస్తున్నారు. రాజకీయ అవినీతిపై ప్రధాని మోదీ, అమిత్ షా ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారో దేశం మొత్తం తెలుసు. అవినీతి చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని అనేక సార్లు రుజువయింది. కానీ ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీని బద్నాం చేయడానికే ఇలా చంద్రబాబు, అచ్చెన్నాయుడు రాజకీయ విమర్శలు చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు.
బీజేపీ ఏంటో ప్రజలకు తెలుసు.. ప్రాంతీయ పార్టీల కుట్రలు సాగవు !
అటు వైసీపీ నేతలు .. తమకు బీజేపీ దగ్గర అని చెప్పుకునేందుకు చూపించుకునేందుకు తంటాలు పడుతున్నారు.. .. ఇటు పక్క ఢిల్లీ పెద్దలకు తాము దగ్గర అని చెప్పుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి వచ్చే సరికి.. కుట్రలు చేస్తున్నారు. అయితే ఏపీ బీజేపీ మాత్రం.. ప్రాంతీయ పార్టీల కుట్రను చేధిస్తామని… తాము ఎప్పుడూ ఎవరికీ దగ్గరా.. దూరం కాదని. ఆయా నేతల ఆశలు.. ఆకాంక్షలు తీర్చుకోవడానికి పావులుగా ఉండబోమని స్పష్టం చేస్తోంది. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమని పని చేస్తామని.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.