ఒడిశా రైలు ప్రమాదం అనేక ప్రశ్నలను ఆవిష్కరించింది. మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 300 మంది చనిపోవడంతో ప్రపంచం దృష్టే ఒడిశా వైపు మళ్లింది. భారత్ లో రైల్వే వ్యవస్థ సరిగ్గా లేదని, అక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని విదేశీ మీడియా కథనాలు వండి వార్చింది. ఎక్కడా జరగనట్లుగా, ఇండియాలోనే రైలు ప్రమాదాలున్నట్లుగా కొన్ని ఫారిన్ ఛానెల్స్ కలరింగ్ ఇచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా రైలు ప్రమాదాలను విశ్లేషిస్తే మాత్రం వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి.
విదేశాల్లో ప్రమాదాలు జరగడం లేదా..
కోరమాండల్ రైలు ప్రమాదం ఇలా జరిగిందో లేదో… విదేశీ మీడియా రంగంలోకి దిగింది. భారతీయ రైళ్లలో ప్రయాణించడం పెద్ద రిస్క్ అంటూ ప్రచారం మొదలెట్టింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రైలు ప్రయాణం ఇండియాలోనే ఉంటుందని, అందుకే ఇండియా టూర్ కు వచ్చినా అక్కడి రైళ్లలో ఎక్కబోమని కొందరు విదేశీ పర్యాటకులతో చెప్పించింది. కుట్రలు, మానవ తప్పదం లాంటి థియరీలను తెరమీదకు తెస్తూనే.. భారత్ పై బురదజల్లేందుకు చేయాల్సిందంతా చేసింది. గురివిందకు కింద నలుపు తెలియదన్నట్లుగా తమ దేశంలో రైలు ప్రమాదాల తీవ్రతను ఆయా మీడియా సంస్థలు మరిచిపోయాయి.
భారత్ తో పోల్చుకుంటే గ్రీస్ లో రైలు ప్రమాదాలు ఎక్కువని నిగ్గు తేల్చి చాలా రోజులైంది. అక్కడ ప్రమాదాల్లో రైలు తగలుబడిపోయి ప్రయాణికులు సజీవ దహనమైన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆస్ట్రియాలో రెండు రైళ్లు నేరుగా ఢీ కొన్న సంఘటనలు నమోదయ్యాయి. బెల్జియం , ఇటలీలో కూడా తరచూ రైలు ప్రమాదాలు నమోదవుతూనే ఉన్నాయి.
ఐరోపాలో ప్రమాదాలు అధికం
జనాభా పరంగా చూసుకుంటే భారత్ కంటే ఐరోపాలోనే ప్రమాదాలు ఎక్కువని గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. అక్కడ తక్కువ జనాభా ఉన్నా ఎక్కువ రైలు ప్రమాదాలు నమోదవుతాయి 2019వ సంవత్సరం యూరప్ లో 1,500 రైలు ప్రమాదాలు జరిగాయి. వందల మంది చనిపోయారు. 2010 నుంచి 2020 మధ్య కాలంలో యూరప్ లో ఇరవై వేల వరకు ఓ మోస్తరు రైలు ప్రమాదాలు నమోదయ్యాయి. పది వేల మంది చనిపోతే, తొమ్మిది వేల మంద క్షతగాత్రులయ్యారు. 2021లో ఐరోపా రైలు ప్రమాదాల్లో జర్మనీ నెంబర్ వన్ గా ఉంటే, చిన్న దేశం పోలాండ్ రెండో స్థానాన్ని ఆక్రమించింది.
భారత్ రైళ్ల రద్దీపై విమర్శలు
చైనా బుల్లెట్ ట్రైన్స్ లో తరచూ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. వాటి గురించి మాట్లాడే ధైర్యం ఎవరూ చేయడం లేదు. ముంబై లోకల్ రైళ్ల రద్దీపై మాత్రం ఫారినర్స్ తెగ జోకులు వేస్తుంటారు. లండన్ అండర్ గ్రౌండ్ ట్రైన్స్, న్యూయార్క్ సబ్ వేలలో రద్దీ ఉండదని మాత్రం చెప్పలేరు. అక్కడ తోసుకుంటూ రైలు ఎక్కడం మామూలు విషయం కాదు. విదేశీయులు భారతీయ రైళ్లను ఎగతాళి చేయడమే కానీ, భారతీయులు ఎన్నడూ విదేశీ రైళ్లను పల్లెత్తు మాట అన్న సందర్భం లేదు. జపాన్ లో అయితే జనం ఎక్కువై రైలు డోర్ మూసుకోకపోతే.. సిబ్బంది వచ్చి జనాన్ని లోపలికి తోస్తుంటారు. ఇలాంటి ఘటనలు విదేశీయుల కళ్లకు కనిపించడం లేదు..
ఇండియన్ రైల్వే వ్యవస్థ ది బెస్ట్
ఎవరు ఒప్పుకున్నా..ఒప్పుకోకపోయినా భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని చెప్పుకునేందుకు వెనుకాడకూడదు. దేశంలో 22 వేల రైళ్లు నడుస్తున్నాయి. రోజు వారీగా ఆ రైళ్లు 67 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. దాదాపు రెండున్నర కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చుతాయి. పోర్చుగల్, స్వీడన్, లాట్వియా జనాభా మొత్తం కలిపితే ఎంత ఉంటుందో అంత కంటే ఎక్కువ మందిని భారతీయ రైల్వే రోజు వారికి కావాల్సిన ప్రదేశాలకు తీసుకెళ్తుంది. భారతీయ రైల్వే చేపట్టిన భద్రతా చర్యల కారణంగా ప్రమాదాలు భారీగా తగ్గాయి. రెండు దశాబ్దాల క్రితం వరకు రైలు ప్రమాదాలతో ఏటా చనిపోయే వారి సంఖ్య సగటున 300 ఉండేది. ఇప్పుడది 22కి తగ్గిపోయింది. నిజానికి 2021 , 2022లో దేశంలో రైలు ప్రమాదాలతో దేశంలో ఎవరూ చనిపోలేదు. ఈ ఏడాది మాత్రమే ఒడిశా రైలు ప్రమాదంలో మరణాలు సంభవించాయి. దానికి కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
విదేశీయుల విమర్శలు కాదు.. భారతీయుల భద్రత
విదేశీయుల విమర్శలను భారత ప్రభుత్వం ఎన్నడూ పట్టించుకోలేదు. తమ పౌరుల భద్రతపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది. రైలు ప్రమాదాల నివారణకు కవచ్ వ్యవస్థను తీసుకొస్తున్నారు. ట్రాక్స్ నిర్వహణను ఎప్పటికప్పుడు మెరుగు పరుస్తున్నారు. విద్యుదీకరణపై ప్రత్యేక దృష్టి పెడుతూ అన్ని చోట్ల ఎలక్ట్రిక్ టైన్స్ ప్రవేశ పెడుతున్నారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. మెట్రో రైళ్లలో ప్రయాణం సౌకర్యవంతంగా మారింది. ఇప్పటి వరకు ప్రవేశ పెట్టిన వందే భారత్ రైళ్లు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.
విదేశీయుల అజెండా అభాసుపాలు
భారత్ ను తక్కువ చేసి చూపించేందుకు విదేశీయులు, విదేశీ మీడియా ప్రయత్నిస్తూనే ఉంటుంది. వారి కోరిక ఎన్నటికీ నెరవేరదని ఇండియన్ రైల్వే జైత్రయాత్ర చెబుతూనే ఉంటుంది. ఒకప్పుడు భారత్ సంపదను పిండికున్న విదేశీ పాలకులు ఇప్పటికీ ఆ ఆకాంక్షను మరిచిపోలేక మనపై బురద జల్లుతున్నారన్న అనుమానమూ కలుగుతోంది. మేకిన్ ఇండియాతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారతీయ సమాజం.. ఇప్పుడు రైల్వే వ్యవస్థలోనూ అదే మార్గాన్ని అనుసరిస్తోంది. అందుకే విదేశీయులు చవకబారు విమర్శలతో మన అభివృద్ధిని ఆపలేదన్నది మాత్రం నిజం..