హిందువులు పాటించే ప్రతి ఆచారం, సంప్రదాయాలను నాటి తరం పూర్తిగా తెలుసుకుని శ్రద్ధగా ఆచరించేవారు. ఇప్పటి తరం కూడా వాటిని అనుసరిస్తున్నారు కానీ..ఎందుకు అనేది తెలుసుకోరు. అందులో ఒకటి నదిలో నాణేలు వేయడం. పుష్కరాలకు వెళ్లినప్పుడు, నదీ స్నానాలు చేసేటప్పుడు, జర్నీలు చేసేటప్పుడు నదుల్లో నాణేలు వేసి నమస్కారం చేస్తుంటారు. పూర్వకాలంలో శాస్త్రీయ కోణం గురించి చెబితే చాలామందికి అర్థమయ్యే పరిస్థితి లేకపోవడంతో…దేవుడి పేరు చెప్పి ఆ పద్ధతులు పాటించేలా చేస్తున్నారు. అప్పటి వారు తమ తర్వాతి తరం వారు కూడా అవే అనుసరించేలా సూచిస్తూ వచ్చారు. కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం పాటించాలనే చాదస్తం తప్ప వాటివెనుకున్న ఆంతర్యాన్ని గుర్తించడం లేదు.
రాగి నాణేలు వేయాలి
ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లినప్పుడు అక్కడ స్నానం చేసేందుకు కోనేరు, నది, సరస్సుల్లోకి వెళ్తుంటారు. ఆ సమయంలో అందరూ భక్తి శ్రద్ధలతో నదిలో స్నానం చేసి దేవుని దర్శనానికి బయలుదేరుతారు. అదే సమయంలో నదిలో దీపాలను వదులుతారు. కొందరు కొబ్బరికాయలు, నాణేలు వేస్తుంటారు. అయితే నదుల్లో వేయాల్సింది ఇప్పుడు చలామణిలో ఉన్న నాణేలు కాదు రాగి నాణేలు . ఇప్పుడున్న రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు ఇనుముతో తయారుచేసినవి. కానీ అప్పట్లో నాణేలన్నీ కేవలం రాగితోనే తయారు చేసేవారు. వాటిని ప్రవహించే నదిలో వేయడం వల్ల నీరు స్వచ్ఛంగా మారుతుంది. అందుకే అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఆ పని చేసే వారు. రాగి పాత్రలకు, రాగి నాణేలకు నీటిని శుభ్రం చేసే గుణం ఉంటుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. అందుకే రాగి నాణేలు వేయడం వల్ల నదిలోని నీరు శుభ్రంగా మారుతుందని, దాని వల్ల తాగునీటిలో ఎలాంటి కలుషితాలు ఉన్నా తొలగిపోతాయని అలా చేసేవారు. పైగా అప్పట్లో అంతా నదుల్లో నీటిని నేరుగా తాగేవారు. ఇప్పటిలా ఫిల్టర్లు లేవు. అందుకే రాణి నాణేలు వేసి నీటిని శుభ్రపరిచేవారు.
ఈ నాణేలు వేయొద్దు
ఇప్పుడున్న నాణేలు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు సరికదా మరింత నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాడుతున్న నాణేలను నదిలో వేయడం వల్ల అవి తుప్పుపట్టి నది నీళ్లు పాడయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఆ చిల్లర పైసలు ఏరుకునేందుకు నదుల్లో దూకి కొందరు పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఇకనుంచైనా ఉంటే రాణినాణేలు వేసి నమస్కరించండి లేదంటే డబ్బులు వేయడం మానేయ్యండి. భక్తితో కొబ్బరికాయలు కూడా నదిలోకి విసిరేస్తుంటారు..ఇలా చేసినా నదిలో నీళ్లు పాడవుతాయి. ఇప్పటికే కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాం. చేతురాలా ప్రకృతిని నాశనం చేసి వినాశనాన్ని కొనితెచ్చుకుంటున్నాం. మన పూర్వీకులు పాటించిన సంప్రదాయాల వెనుక ఆరోగ్య రహస్యాలున్నాయి. కానీ వాళ్లని అనసరించామన్న పేరుతో మరింత అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవద్దు, ప్రకృతిని పాడుచేయొద్దంటున్నారు. అప్పటి సంప్రదాయాలను అనుసరించడం మంచిదే అయినా ఎలా చేయాలి…ఎందుకు చేయాలి.. వాటివెనుకున్న ఆంతర్యం ఏంటన్నది తెలుసుకోవాలి..
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం