ఆంధ్రప్రదేశ్ లో 20 లోక్ సభ సీట్లను ఇవ్వాలని ఏపీ ప్రజలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. అది ప్రజలకు చేసిన విజ్ఞప్తి.. మాత్రమే కాదు… ఇక్కడ రాజకీయ పరిస్థితుల్ని అంచనా వేసిన తర్వాత ఆయన పెట్టుకున్న నమ్మకం కూడా అని.. ఏపీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో మిషన్ 20 ప్రారంభమయిందని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి టీవీ చర్చా కార్యక్రమాల్లో ధీమాగా ప్రకటించారు. ఆయన స్పందన ఆషామాషీ కాదని. .. అమిత్ షా ఇచ్చిన ధైర్యం, దిశానిర్దేశం ఉన్నాయని భావిస్తున్నారు.
పార్టీ నేతలకు కీలక సూచనలు చేసిన అమిత్ షా, జేపీ నడ్డా
వరుసగా రెండురోజుల పాటు ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా… పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఇరవై లోక్ సభ సీట్లు గెలుపొందడానికి ఉన్న అవకాశాల గురించి చెప్పారు. ఏపీ బీజేపీ నేతలు గట్టిగా ప్రజల్లోకి వెళ్తున్నారని.. క్రమంగా ఆదరణ పెరుగుతోందన్న నివేదికలు ఉన్నాయని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే మాదిరిగా కష్టపడితే ఎన్నికల నాటికి పుంజుకోవడం ఖాయమని.. అప్పటికి మోదీ ఫ్యాక్టర్ కలిస్తే తిరగు ఉండదని అగ్రనేతలు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రాంతీయ పార్టీలపై ప్రజల్లో పెరుగుతున్న విరక్తి – కేంద్ర నివేదికలు ఇవే చెబుతున్నాయా ?
ఏపీలో ఇరవై సీట్ల టార్గెట్ ను కేంద్ర నాయకత్వం ఉత్తినే పెట్టుకోదని.. ఏపీ బీజేపీ నేతలు నమ్ముతున్నారు. ఏపీలో కొంత కాలంగా ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. అయితే ఏ పార్టీ వచ్చినా కేంద్రం మీద ఆధారపడాల్సిందే. అలాంటప్పుడు కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వమే ఏపీలో ఉంటే… రాష్ట్రం మరింత అభివృద్ధి అవుతుంది కదా అనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఇదే ప్రజాభిప్రాయంగా మారుతోందన్న నివేదికలు కేంద్రం వద్ద ఉన్నాయంటున్నారు. అందుకే అమిత్ షా కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెబుతున్నారు.
ఏపీ బీజేపీ నేతల పోరాటంపై అగ్రనేతల సంతృప్తి
ఇతర రాష్ట్రాల్లో బీజేపీ వేరు.. ఏపీలో బీజేపీ వేరు. అనేక ప్రతికూలతలు అధిగమించి ఏపీ బీజేపీ నేతలు పోరాటాలు చేయాల్సి ఉంటుంది. ఇతర పార్టీలకు స్పేస్ ఇవ్వకుండా రెండు ప్రాంతీయ పార్టీలు రాజకీయం చేస్తూంటాయి. అయితే వారి వ్యవహారాన్ని.. ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచడం ద్వారా కేంద్రం చేస్తున్న మేళ్లను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మార్పు తెచ్చేందుకు ఏపీ బీజేపీ క్యాడర్ చేస్తున్న ప్రయత్నాలు.. బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఆకర్షిస్తున్నాయి. ఎలాంటిసాయం అయినా చేస్తామని పోరాడాలని భరోసా ఇస్తున్నారు.