ఏపీ రాజకీయం అంతా బీజేపీ చుట్టూనే – 2 సభలతో మారిపోయిన రాజకీయం !

అమిత్ షా , జేపీ నడ్డాలు రెండు రోజుల్లో నిర్వహించిన బహిరంగ సభల తర్వాత ఏపీలో రాజకీయం పూర్తిగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది. రెండు రోజుల నుంచి ఏపీలో బీజేపీ అనే మాట తప్పితే మరో రాజకీయ పార్టీ ప్రస్తావన రాలేదు. ఇద్దరు అగ్రనేతలు బహిరంగసభలు పెట్టడం.. వైసీపీపై దూకుడుగా వ్యవహరించడంతో పాటు… ప్రజలు కూడా బహిరంగసభలకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నేతల ప్రసంగాలకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఏపీలో ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తోందని అన్న అభిప్రాయం వినిపించడానికి కారణం అవుతోంది.

బీజేపీ నేతలు కూడా ఊహించనంత జన స్పందన

రెండు ప్రధాన పార్టీల స్థాయిలో బహిరంగసభలకు జన సమీకరణ చేసేంత క్యాడర్ బీజేపీకి లేదన్నది నిజం. కానీ అటు కాళహస్తిలో ఇటు విశాఖలో జరిగిన సభలను చూసిన తర్వాత అందరూ ఈ మాటను నమ్మరు. ఎందుకంటే.. ఆ స్థాయిలో జనం వచ్చారు మరి. విశాఖలో నిర్వహించిన సభకు గ్రౌండ్ నిండిపోయింది. కొన్ని వేల మంది బయట నిలబడి అమిత్ షా ప్రసంగాన్ని విన్నారు. ఈ స్థాయి జన స్పందన ఉంటుందని బీజేపీ అగ్రనేతలు కూడా ఊహించలేకపోయారు. అందుకే … రాష్ట్ర పార్టీ నేతల్ని అభినందించారు.

ఏపీనే కీలకమని గుర్తించిన రాజకీయ పార్టీలు

ఏపీ రాజకీయాల్లో బీజేపీనే కీలకం అని అన్ని పార్టీలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి. జేపీ నడ్డా , అమిత్ షా పొత్తులపై ఏమైనా చెబుతారేమోనని చాలా మంది ఎదురు చూశారు. అయితే కనీసం ఎన్నికల సమయంలోనే పొత్తులు అనే మాటలు కూడా మాట్లాడలేదు. దీంతో ప్రాంతీయ పార్టీల నేతలు నిరాశకు గురయ్యారు. వారు ఎందుకు అంత హోప్స్ పెట్టుకున్నారంటే.. బీజేపీ ఎంతకీలకమో వారికి తెలుసు. బీజేపీకి అతి తక్కువ ఓటు బ్యాంక్ ఉందని హేళన చేయవచ్చు కానీ అసలు బలమేంటో వారికి తెలుసు.

పొత్తులపై సంగతి పక్కన పెట్టి సొంత కార్యక్రమాలు చేపట్టనున్న బీజేపీ !

అగ్రనేతల సభలతో వచ్చిన ఉత్సాహంతో బీజేపీ ఏపీ నేతలు… పార్టీ హైకమాండ్ తకు ఇచ్చిన టాస్కుల్ని వేగంగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించనున్నారు. నెలాఖరు వరకూ మోదీ ప్రభుత్వ పాలనా విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. తర్వాత ప్రజాపోరు యాత్ర వంటివి చేపట్టనున్నారు. ఈ మధ్యలో కేంద్ర పార్టీకి చెందిన అగ్రనేతలు కూడా రానున్నారు. ప్రధాని మోదీతో కూడా సభను ఏర్పాటు చేయించాలన్న పట్టదలతో నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది.