వైసీపీపై బీజేపీ స్టాండ్ క్రిస్టల్ క్లియర్ – ఆ పార్టీల కుట్రలు తేలిపోయినట్లే !

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, వైసీపీ ఒక్కటే అనుకుంటున్నారనే ప్రచారం కొంత కాలంగా చాప కింద నీరులా కొన్ని పార్టీలు చేస్తూనే ఉన్నారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ పీవీఎల్ మాధవ్‌ పరాజయానికి ఇదే కారణం. అంతే కాదు గత ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడానికి కూడా ఇదే ప్రచారం. బీజేపీ ఎలాగూ గెలవదని.. వైసీపీకే ఓటు వేయాలని వ్యవస్థీకృతంగా చేసిన ప్రచారం వల్ల బీజేపీ తీవ్రంగా నష్టపోయింది. గత నాలుగేళ్లుగా ఆ ప్రచారం సాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రచారానికి నడ్డా, అమిత్ షాలు చెక్ పెట్టారు.

వైసీపీ అవినీతి పాలనను ప్రజల ముందు పెట్టిన అమిత్ షా, నడ్డా

భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు వరుసగా రెండు రోజులు నిర్వహించిన బహిరంగసభల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించారు. నిజానికి వారు పెట్టుకున్న సభలు నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలను ప్రచారం చేయడానికే. అయితే ఏపీలో మళ్లీ సభలు ఎప్పుడు పెడతారో తెలియదు కానీ.. తమ స్టాండ్ ఏమిటో తెలియచేయాలనుకున్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. మొదటి రోజు జేపీ నడ్డా చేసిన విమర్శలు ఘాటుగా ఉంటే.. రెండో రోజు అమిత్ షా కూడా అవే రిపీట్ చేశారు. దీంతో వైసీపీ విషయంలో బీజేపీ కి క్లారిటీ ఉందని అందరికీ అర్థమయింది. వైసీపీని ఏ మాత్రం వెకేసుకు రావట్లేదని ప్రజలకూ స్పష్టత వచ్చింది.

వైసీపీతో ఎలాంటి సహకారాన్ని బీజేపీ కోరుకోదు !

వైసీపీకి అవసరం కాబట్టే కేంద్రానికి అవసరమైనప్పుడు మద్దతు ఇస్తోంది. ఇలా మద్దతు ఇచ్చి తాము బీజేపీ ఒకటే అన్న అభిప్రాయాన్ని కల్పిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తామూ.. వైసీపీ ఒకటి కాదని.. బీజేపీ చెబుతోంది. ఏపీలో ఏం జరుగుతుందో బీజేపీ నేతలకు ఓ స్పష్టత ఉందని జేపీ నడ్డా, అమిత్ షాలు చేసిన ప్రసంగాలతో స్పష్టమయింది. ప్రజలు ఇచ్చిన అధికారం కారణంగా జగన్ సీఎంగా ఉన్నారు కాబట్టి .. తమ జోలికి రాలేదు కాబట్టి వివాదాస్పదమైన అంశాల్లో బీజేపీ ఇప్పటి వరకూ తలదూర్చలేదని అనుకోవచ్చు. కారణం ఏమైనప్పటికీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వంపై వారు ఏ మాత్రం సానుభూతి చూపించే పరిస్థితుల్లో లేరని మాటలను బట్టి అర్థమవుతుంది.

ఇతర పార్టీలు చేసే ప్రచారాలకు చెక్ పడినట్లే !

జగన్ ప్రభుత్వానికి కేంద్రం ఎప్పటికప్పుడు అండగా ఉంటుందని ఇతర పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. రాజ్యాంగ పరంగా రాష్ట్రానికి రావాల్సిన అప్పులు.. నిధులు ఇచ్చినప్పుడు ఇలాంటి ప్రచారాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇక ముందు అలాంటి ప్రచారాలకూ కూడా బీజేపీ చాన్సివ్వదని అమిత్ షా , నడ్డాలు వైసీపీపై చేసిన ఎటాక్ తోనే స్పష్టమయినట్లుగా అంచనా వేయవచ్చు. మొత్తంగా ఏపీ బీజేపీపై ఉన్న ఓ పెద్ద మరకను.. నడ్డా,షాలు తమ బహిరంగసభలతో తుడిచేశారన్న అభిప్రాయం బీజేపీ క్యాడర్ లో వినిపిస్తోంది.