హాఫ్ సెంచరీ దాటిన స్త్రీలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

శరీరంల ప్రతి పదేళ్లకోసారి మార్పులు జరుగుతుంటాయి. పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో ఈ మార్పులు స్పష్టంగా తెలుస్తాయి. మరీ ముఖ్యంగా నలభైఏళ్ల వరకూ పర్వాలేదు కానీ హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత మాత్రం చాలా మార్పులొస్తాయి. నిద్రలో, హృదయ స్పందనలో , జీర్ణ ప్రక్రియలో మార్పు తెలుస్తూనే ఉంటుంది. హార్మోన్లలో మార్పులతో పాటూ ఎముకలు బలహీనపడుతుంటాయి. అందుకే ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందొచ్చంటారు ఆరోగ్య నిపుణులు.

పోషకాహారం
వయసును బట్టి శరీరానికి అవసరమయ్యే పోషకాల మోతాదు, శరీరం పోషకాలను గ్రహించే తీరు కూడా మారుతూ ఉంటుంది. గతంలో తిన్నట్టుగానే తినడం, గతంలో తీసుకునే ఆహారం కంటిన్యూ చేయడం కాదు… విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం అవసరం. ఇలా సమతుల ఆహారం తీసుకుంటే రక్తనాళాలు, గుండె ఆరోగ్యం బావుటుంది. డయాబెటిస్ దరి చేరకుండా నివారించవచ్చు. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడంతో పాటూ ప్రాసెస్ చేసిన ఆహారానికి, చక్కెరకు దూరంగా ఉండాలి. కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

వ్యాయామం తప్పనిసరి
శరీరం ఫిట్ గా ఉండడంలో 60 శాతం ఆహారం మీద ఆధారపడి ఉంటే మిగతా 40 శాతం వ్యాయామం మీద ఆధారపడి ఉంటుంది. రోజులో కనీసం 30 నిమిషాల వ్యాయమం అవసరం. దీన్ని అలవాటుగా మార్చుకోవాలి. వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి కార్డియో ఎక్సర్సైజులు ఎంచుకోవాలి. యోగా, మెడిటేషన్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

విశ్రాంతి
వయసు పైబడే కొద్ది నిద్ర పోయే సమయం తగ్గుతుంటుంది. కానీ కావల్సినంత విశ్రాంతి అవసరముంటుందని మరచిపోవద్దు. రోజూ ఒకే సమయానికి నిద్ర పోవడం అలవాటు చేసుకుంటే మంచిది. ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉన్నవారు దీన్ని అదుపులో ఉంచుకోవాలి.

ఆరోగ్య పరీక్షలు
స్క్రీనింగ్ షుగర్, బీపీ, గుండెజబ్బులు, కొలెస్ట్రాల్, ఆస్టియోపొరొసిస్, క్యాన్సర్ వంటి సమస్యలకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి.

కేవలం శారీరక మార్పులు మాత్రమే కాదు మానసిక మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇది వరకు ఉన్నంత బీజీగా మీరు ఉండకపోవచ్చు కాస్త ఎక్కువ ఖాళీ సమయం దొరికే అవకాశం ఉంటుంది. అందుకే కొత్త హాబీలు ఏర్పాటుచేసుకోవాలి. స్నేహితులతో సమయం గడిపేందుకు ప్రయత్నించండి ఇది మీ ఆనందాన్నిపెంచుతుంది. అప్పుడప్పుడు సరదాగా చిన్నచిన్న ట్రిప్ లు కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం