వాళ్ల ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరూ ?

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారును గద్దె దించాలన్న ప్రయత్నాలకు విపక్షాలే గండి కొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికి వారే మహానాయకుడిగా భావిస్తూ ఇతరులను వెనక్కి తోయాలన్న ఆలోచన ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. అందరూ కలిసినట్లే ఉంటున్నా…ఎవరికి వారు వేరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

నితీశ్ కాలికి బలపం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరిగారు. అప్పుడు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ను కూడా కలిశారు. కేసీఆర్ ప్రతిపాదనలకు మౌనం వహించిన నితీశ్ ఇప్పుడు మాత్రం విపక్షాల ఐక్యత అంటూ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. రోజుకో రాష్ట్ర రాజదానికి వెళ్లి నేతలను ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించిన నితీశ్.. ఇప్పుడు పట్నాలో కూర్చుని లెక్కలేస్తుకుంటున్నారు.

నేను పీఎం అంటున్న మాయ…

మాయావతికి ఒకప్పుడు ప్రధాన మంత్రి కావాలన్న కోరిక ఉండేది. యూపీలో ఘోర పరాజయం తర్వాత అలాంటి ప్రస్తావనలు మరుగునపడిపోయాయి. 2024 ఎన్నికలకు ఐక్య కూటమి ప్రతిపాదనలు వస్తున్న నేపథ్యంలో మాయావతి మళ్లీ నేనే పీఎం అంటున్నారు. బెహన్జీ బనేగీ ప్రధానమంత్రి అంటూ అనుచరుల చేత నినాదాలిప్పించుకుంటున్నారు.అందరూ కలిసి పోటీ చేయాల్సివస్తే మాయావతిని ప్రధాని అభ్యర్థిగా గుర్తించాలని బీఎస్పీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే యూపీ, పంజాబ్ లో బీఎస్పీ బలహీనపడి పోవడంతో ఆమె అతిగా ఆలోచిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది..

వాళ్లని ఆహ్వానించలేదా…

ఈ నెల 23న పట్నాలో జరిగే విపక్ష నేతల భేటీకి బీఎస్పీని ఆహ్వానించలేదన్న వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జెడీ, బీజేడీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలను నితీశ్ ఆహ్వానించారు. బీఎస్పీతో పాటు బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ నేతృత్వంలోని హెచ్ఏఎంను ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఈ సంగతి మాంఝీ స్వయంగా వెల్లడించారు. అయితే కూటమితో సంబంధం లేకుండా నితీశ్ పార్టీతో మాంఝీ చర్చలు జరుపుతున్నారు. తమ పార్టీకి ఐదు లోక్ సభా స్థానాలు కేటాయించాలని ముఖాముఖి చర్చల్లో ఆయన కోరారు. ఇలాంటి చర్యల వల్ల మహాకూటమిలో విభేదాలు తారా స్థాయికి చేరే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే నితీష్ రెండు వైపులా గేమ్ ఆడుతున్న అనుమానాలు మిత్రపక్షాల్లో నెలకొంటున్నాయి.

అభ్యర్థి ప్రకటన ఇప్పుడే కాదట..

విపక్షాల్లో ప్రతీ ఒక్కరూ ప్రధాని అభ్యర్థే కావడంతో అందరూ గుంభనంగా ఉంటున్నారు. మమతా బెనర్జీ కూడా కొన్ని రోజుల క్రితం తాను ప్రధాని అభ్యర్థినని చెప్పుకున్నారు. నితీశ్ కు ఆ కోరిక ఉంది. అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన అఖిలేష్ యాదవ్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంగ్రెస్ వాళ్లయితే రాహుల్ గాంధీకే పీఎం పదవి కట్టబెట్టాలని ఎదురు చూస్తున్నారు. దానితో పోటీ ఇప్పుడే వద్దన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి నుంచి తన్నుకునే కంటే… ఎన్నికల తర్వాత ఏ సంగతైనా చూసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అంతకుమించి మరో కోణం కూడా ఆవిష్కృతమవుతోంది. ప్రధాని మోదీకి తాము సాటి కాదని తెలుసుకున్న నేతలు ఒకరొక్కరుగా మౌనం వహిస్తున్నారని చెప్పుకుంటున్నారు…