వీరి రుణం మీరు ఈ జీవితంలో తీర్చుకోలేరు!

ఓవ్యక్తి బాగా సంపాదించినంత మాత్రాన గొప్పవాడు కాలేడు. తను ఆ స్థితికి చేరుకోవడానికి ఎంతమంది ఆశీర్వదించారు, ఎంతమంది సహకరించారు, ఎంతమంది కష్టపడ్డారు అన్న విషయాన్ని గుర్తించినప్పుడు ఆ వ్యక్తి ఉత్తముడు అవుతాడని శిష్యులకు బోధించాడు ఆచార్య చాణక్యుడు. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షంగా మనకు కనిపించకపోయినా ఆ రూపంలో 8 మందిని మీ చుట్టూ ఉంచాడు..వాళ్లని గుర్తించకపోయినా పూజించకపోయినా పర్వాలేదు కానీ అవమానించడం తగదన్నాడు. ఇంతకీ ఎవరా 8 మంది

అమ్మ
అమ్మను అవమానిస్తూ, పట్టించుకోకుండా వదిలేసి నిత్యం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దానివల్ల ఫలితం ఉండదంటాడు చాణక్యుడు. 9 నెలలు తన కడుపులో భద్రంగా చూసుకుని భూమ్మీద పడినప్పటి నుంచీ కంటికిరెప్పలా కాపాడుకుంటూ మీ క్షేమం కోసం తపించే నిస్వార్థ వ్యక్తి తల్లి. మృత్యువుతో పోరాడి మరీ బిడ్డకు జన్మనిచ్చే తల్లిరుణం తీర్చుకోవాలంటే ఏమివ్వగలరు. అందుకే ఆ రుణం తీర్చుకోలేకపోయినా పర్వాలేదు కానీ అవమానించకండి

నాన్న
బిడ్డ పుట్టకముందునుంచే బాధ్యతలు తీసేసుకునే వ్యక్తి నాన్న. పిల్లల్ని పెంచి పెద్దచేసేందుకు, సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు పాటుపడతాడు. తండ్రి బీజం వేయనిదే మీ పుట్టుకేలేదు…అలాంటి వ్యక్తిని దూషించడం అంటే దేవుడిని నిందించడమే. ఇప్పటి జనరేషన్లో తల్లిదండ్రులను అడ్డుగా భావిస్తున్న పిల్లలున్నారు..ఇలాంటి వారు ఎంత సంపాదించినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా చేసిన పాపాన్ని మాత్రం కడుక్కోలేరు.

గురువు
తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుదే. సమాజ ఉద్ధరణకు విద్య ఆయుధం లాంటిది. ఓ వ్యక్తికి ఆహారం ఎంత అవసరమో విద్య కూడా అంతే అవసరం. మిమ్మల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దిన వారిని పొరపాటునైనా దూషిస్తే మీ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. ఇలాంటి వారు ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదు

మీ శ్రేయోభిలాషి
తల్లిదండ్రులే కాదు..మీకు విలువలు నేర్పించే వ్యక్తులు కొందరుంటారు. వారి మాటలు ఆచరిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ శ్రేయోభిలాషులు ఇంట్లో వారు కావొచ్చు, చుట్టుపక్కల కావొచ్చు, బయటివారు కావొచ్చు. మంచి చెప్పినా చెవికి ఎక్కించుకోకుండా ధిక్కరించడం అంటే దేవుడిని అవమానించినట్టే అన్నాడు చాణక్యుడు

మీకు భోజనం పెట్టిన వ్యక్తి
మీకు అన్నం పెట్టిన వారిని ఎన్నటికీ దూషించరాదన్నాడు. మీ జీవితంలో శత్రువులు, స్నేహితులు చాలామంది ఉండొచ్చు కానీ…మీరు ఎవరన్నది చూడకుండా మీ ఆకలి తీర్చేవాడు దేవుడితో సమానం. అలాంటి వారికి గౌరవం ఇవ్వనివాళ్లు..దేవుడుని పూజించి ఏం లాభం..

స్నేహితుడు
స్నేహితుల్లో ఉత్తములు ఉంటారు, అధములు ఉంటారు. ఎవరు ఏంటన్నది తెలుసుకోవాలి. కష్టకాలంలో వెన్నంటే ఉండే తండ్రిలాంటి వ్యక్తే నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడిని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ మీకు తెలియకుండా కూడా దూషించకండి.

భార్య తల్లిదండ్రులు
చాలామంది పురుషులు తమ తల్లిదండ్రులకు పట్టం కడతారు కానీ.. భార్య తల్లిదండ్రులంటే మాత్రం చులకన భావంతో చూస్తారు. తల్లిదండ్రుల విలువ తెలిసిన వ్యక్తి, నిజంగా తల్లిదండ్రులను గౌరవించే వారు ఎప్పటికీ ఎవ్వరి తల్లిదండ్రులనూ దూషించలేరన్నాడు చాణక్యుడు. ఇలాంటి దూషణకు పాల్పడినవారిని దేవుడు కూడా క్షమించడని చెప్పాడు చాణక్యుడు

సంరక్షకులు
తల్లి, తండ్రి స్థానంలో సంరక్షకులుగా ఉంటారు కొందరు. వాళ్లు కూడా మీ బాగుకోసం పాటుపడుతూ ఉంటారు. వారిపై విధేయత చూపాలి. లేదంటే ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదని శిష్యులకు బోధించాడు చాణక్యుడు.