తెలంగాణ కాంగ్రెస్ చివరి ఆశ ప్రియాంకా గాంధీ !

తెలంగాణ కాంగ్రెస్ .. కర్ణాటకలో తమ పార్టీకి లభించిన విజయంతో తమకు తాము గాలి కొట్టుకునే పనిలో ఉంది. ఎవరూ చేరకపోయినా చేరిపోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. కానీ పరిస్థితి ఎలా ఉందో వారికి తెలుసు కాబట్టి… ఇప్పుడు ప్రియాంకా గాంధీ రావాలని కోరుకుంటున్నారు. ఆమెను తెలంగాణ ఇంచార్జ్ గా పెట్టాలని కోరుతున్నారు. ప్రియంకా కూడా రెడీ అయిపోయారు. అయితే హోంస్టేట్ యూపీలో చేసిందేమీ లేకపోవడంతో ఇక్కడేం చేస్తారన్నది కొంత మందికి వస్తున్న సందేహం. కానీ ఎవరూ బయటకు చెప్పుకోలేరు. ఎందుకంటే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కానీ.. గాంధీ ఫ్యామిలీ మీద నోరు జారకూడదు.

తెలంగాణ బాధ్యతలు ప్రియాంకకు ఇచ్చిన సోనియా

రాహుల్ .. సోనియాల మధ్య ఆధిపత్య పోరాటం ఉందో లేదో కానీ కొన్ని బాధ్యతల్ని మెల్లగా సోనియ ప్రియాంకకూ పంచుతున్నారు. ప్రియాంకా గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలనే టాస్క్ ఇచ్చి పంపిస్తున్నారు. పెట్టుకున్నారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉత్తర ప్రదేశ్ బాధ్యతలు చూస్తున్న ప్రియాంకాగాంధీ ఆ బాధ్యతలు నుంచి వైదొలిగారు. ఈ నెలలో టీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భేటీ కానున్నారు . నాయకుల మధ్య ఐక్యత, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారని టీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకోవాలంటే ఎలాంటి వ్యూహలు అనుసరించాలనే దానిపై చర్చిస్తామని అంటున్నారు.

ప్రియాంకకు హిమాచల్, కర్ణాటక గెలుపు క్రెడిట్

హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తర్వాత కాంగ్రెస్ లో ఆ క్రెడిట్ అంతా రాహుల్ కు కాకుండా ప్రియాంకు ఇచ్చేందుకు నేతలు పోటీ పడ్డారు. హిమాచల్, కర్ణాటక రాష్ట్రాల్లో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలతో ప్రచారం నిర్వహించారని, కాంగ్రెస్ గెలుపుకు ఇది దోహదపడిందని చెబుతున్నారు. ప్రియాంక పార్టీలో కీలక పాత్రను పోషించాల్సిన అవశ్యకత ఉందని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అయితే ప్రియాంక ప్రభావం ఎక్కువగా ఉంటుందని… పూర్తిగా ఆమెకే బాధ్యతలు అప్పగించాలని స్వయం డిమాండ్లు ప్రారంభించేశారు.

తెలంగాణ నుంచి పోటీ చేస్తారని ప్రచారం

కొంత కాలంగా తెలంగాణ ఇంంచార్జ్ గా ప్రియాంక గాంధీని నియమిస్తారన్న ప్రచారం ఉంది. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా తెలంగాణ నేతలుతమకు ఏ సమస్య వచ్చినా ప్రియాంకా గాంధీ వద్దకే వెళ్తున్నారు. ప్రియాంక కూడా యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఆమె తెలంగాణ నుంచి కూడా పోటీ చేస్తారనిప్రచారం చేస్తున్నారు. అయితే అంత ధైర్యం చేయకపోవచ్చని అంటున్నారు. ఇప్పుడు టీ కాంగ్రెస్ పూర్తిగా… ప్రియాంక గాంధీపై ఆశలు పెట్టుకున్నట్లయింది.