రాజస్థాన్ కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ పట్టు వీడటం లేదు. ముఖ్యమంత్రి పదవిపై ఆయన ఆశ వదులుకోవడం లేదు. అధిష్టానం తన డిమాండ్ నెరవేరుస్తుందన్న విశ్వాసం ఆయనకు లేదు. రాష్ట్ర పార్టీ ఇకపై కొనసాగుతానన్న నమ్మకం లేదు. అందుకే ఆయన సరికొత్త కార్యాచరణకు దిగుతున్నట్లుగా తెలుస్తోంది. తేల్చేసే టైమ్ వచ్చిందని పైలట్ నిర్ణయానికి వచ్చినట్లుగా భావిస్తున్నారు..
జూన్ 11 రాజేష్ పైలట్ వర్థంతిన…
సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్ వర్థంతిని ఈ నెల 11న పాటించనున్నారు. అప్పుడు ఆయన స్వగ్రామంలో వర్థంతి కార్యక్రమాన్ని అభిమానుల సమక్షంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఆ రోజున సచిన్ పైలట్ కీలక ప్రకటన చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆ రోజు ర్యాలీలు, మీటింగులు లేకపోయినా సచిన్ చెప్పబోయే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పార్టీ పేరు ప్రజాతంత్ర కాంగ్రెస్ ?
సీఎం అశోక్ గెహ్లాట్ పై వత్తిడిని పెంచి సీఎం పదవిని లాక్కునేందుకు సచిన్ బహుముఖ వ్యూహాన్ని పాటించారు. తన మద్దుతదారులను పెంచుకోవడంతో పాటు ముఖ్యమంత్రిగా ఆరోపణాస్త్రాలు సంధించారు. గత వసుంధరా రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతిని విచారించేందుకు ఓ సంఘాన్ని నియమించాలని కోరుతూ ఏప్రిల్ 11న ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మే 11 నుంచి ఐదు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. దానితో కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరు నేతలను మే 29న ఢిల్లీ పిలిపించి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించింది. ఐదు గంటల పాటు చర్చలు జరిగినప్పటికీ ఇద్దరూ తగ్గేందుకు అవకాశాలు కనిపించలేదు. దానితో ప్రజాతంత్ర కాంగ్రెస్ పేరుతో వేరు కుంపటి పెట్టుకుని రాజకీయాలు చేసేందుకు సచిన్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హామీని నిలబెట్టుకోలేని కాంగ్రెస్ అధిష్టానం
పైలట్ కు గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చి వారం దాటినా కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దానితో సచిన్ తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. అందుకే తన డిమాండ్లపై ఆయన పట్టుబడుతున్నారు. వసుంధరపై విచారణ జరిపించాలని, పేపర్ లీకేజీ కేసు తర్వాత రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పునర్ వ్యవస్థీకరించాలని, పేపర్ లీక్ వల్ల నష్టపోయిన యువతకు పరిహారం అందించాలని సచిన్ డిమాండ్ చేస్తున్నారు.
సచిన్ కొత్త పార్టీ పెడితే ఆయనతో ఎంతమంది ఎమ్మెల్యేలు వెళతారన్నది పెద్ద ప్రశ్నే. ఏదో విధంగా పైలట్ ను పంపించెయ్యాలని గెహ్లాట్ వర్గం ఎదురు చూస్తోంది. పైలట్ వెళ్లిపోయిన పక్షంలో గులాం నబీ ఆజాద్, జ్యోతిరాదిత్య సింథియా, కపిల్ సిబల్, ఆర్బీఎన్ సింగ్, సునిల్ ఝాకర్, అశ్వినీ కుమార్, హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్ జాబితాలో ఆయన కూడా చేరతారా. బయటకు వెళ్లిపోయిన తర్వాత ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి..