భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు అపర చాణుక్యులు. 2014 తర్వాత ఎవరూ ఊహించలేని విజయాలు సాధించడం వెనుక చాణక్య రాజకీయం ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నట్లుగా ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించాయి. అయితే రాష్ట్రాల ఎన్నికల్లోనూ పట్టు జారకుండా ఉండేందుకు.. బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టారు. కర్ణాటకలో జరిగిన లోపాలు మరో చోట రిపీట్ అవకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానాల్లో కార్యాచరణ ప్రారంభించారు.
విస్తృతంగా పర్యటించబోతున్న అమిత్ షా , నడ్డా జోడి
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ.. రాష్ట్రాల ఎన్నికల్లో భిన్నమైన వ్యూహం అమలు చేయాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు బీజేపీ గట్టిగా ప్రయత్నించాల్సిన చోట ఎక్కువగా దృష్టి పెడుతోంది. దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలపై ప్రచారంలో ఉన్నారు. ఆ ప్రచారంలో భాగంగానే రాష్ట్రాలు పర్యటిస్తున్న నడ్డా, షాలు.. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై వ్యూహాలను ఖరారు చేస్తున్నారు. ఏపీ,, తెలంగాణతో పాటు హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఈ జోడి వరుసగా సమవేశాలు .. నిర్వహిస్తోంది.
తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి !
ఏపీ, తెలంగాణలో అమిత్ షా, జేపీ నడ్డాలు బహిరంగసభలు ఏర్పాటు చేశారు. పదో తేదీన జేపీ నడ్డా తిరుపతిలో బహిరంగసభ ఉంటుంది. పదకొండో తేదీన విశాఖ పట్నంలో అమిత్ షా సభ ఉంటుంది. అలాగే నెలాఖరులో తెలంగాణలో ఇద్దరి సభలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై అమిత్ షా ప్రత్యేక దృష్టిపెట్టారు నడ్డాతో కలిసి పార్టీ బలోపేతం కోసం ఇప్పపటికే కొన్ని ప్రణాళికలు అమలు చేయడం ప్రారంభించారు. తెలంగాణలో అధికారం దక్కించుకోవడం ఖాయమన్న అభిప్రాయం వినిపించడంతో… అమిత్ షా పూర్తి స్థాయిలో ఆలోచనలకు పదును పెడుతున్నారు. నాయకులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.
అంతర్గత కలహాలకు దిగితే కఠిన చర్యలు
కర్ణాటకలో బీజేపీ పరాజయానికి అంతర్గత కలహాలు కూడా ఓ కారణం అని బీజేపీ హైకమాండ్ నమ్ముతోంది. అందుకే ఆయా రాష్ట్రాల్లో నేతల మధ్య కలహాలకు పులిస్టాప్ పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పార్టీకి నష్టం చేసేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ, రాజస్థాన్ , మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండటంతో సీనియర్ నేతల మధ్య ఆధిపత్యపోరాటం ఎక్కువగా ఉంది. వీటిని కట్టడి చేయడానికి సిద్ధమయింది.
అమిత్ షా, జేపీ నడ్డా గెలుపు గుర్రాలు.. గెలిచి తీరాలని టార్గెట్ పెట్టుకుంటే… ఎంత కష్టమైనా లక్ష్యాన్ని సాధిస్తారు. ఇప్పుడు వారి జాబితాలో తెలుగు రాష్ట్రాలు ఉండటంతో బీజేపీ వ్యూహం అర్థం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.