గురక చాలామందికి సాధారణమైపోయింది. అప్పట్లో ముసలివారికి గురకొచ్చేది కానీ ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందర్నీ గురక సమస్య వేధిస్తోంది. గురక పెడుతున్న సంగతి ఎవరిది వారికి తెలియకపోయినా పక్కవారికి మాత్రం నిద్రకరువే. గొంతులోని కండరాలు విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు వైబ్రేట్ అయినప్పుడు శబ్దం వచ్చి గురక మొదలవుతుంది. గురక ఏఏ కారణాల వల్ల వస్తుంది..ఏం చేస్తే గురకను అధిగమించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..
-నిద్రించే గదిలో పొడి గాలి ఉండటం వల్ల చాలా మందిలో గురక వస్తుంది. నాసికా రంధ్రాలు, గొంతు పొడిగా మారడం వల్ల గాలి కదలికకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది గురకకు దారి తీస్తుంది. అందుకే తేమను అందించే హ్యుమిడిఫైయర్‌ను గదిలో ఉంచుకోవడం వల్ల సమస్యను కొంత వరకు పరిష్కరించుకోవచ్చు.
-నిత్యం ప్రాణాయామం చేయడం వల్ల శ్వాసక్రియపై పట్టు పెరుగుతుంది.ఈ యోగా ప్రక్రియ వల్ల ఊపితిత్తులకు సరిపడా ఆక్సిజన్ అందుతుంది. శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ప్రాణాయామం చేయడం వల్ల గురక మాత్రమే కాకుండా నిద్రకు సంబంధించిన అనేక రుగ్మతలు దూరం అవుతాయి. శరీరానికి నూతన శక్తి లభిస్తుంది.
- గొంతు, నాలుకలోని కండరాలను బలోపేతం చేయడం ద్వారా గురకను నివారించవచ్చు. గొంతు, నాలుకకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం ద్వారా అవి బలపడతాయి. విశ్రాంతి సమయంలో శ్వాసకు అడ్డు రాకుండా ఉంటాయి.
- అధిక బరువు ఉండటం కూడా గురకకు కారణం అవుతుంది. ఊబకాయుల్లో గొంతులోని అధిక కణాల కారణంగా నిద్రించేటప్పుడు శబ్దం వస్తుంది. శ్వాసక్రియకు ఇబ్బందులు తలెత్తడం వల్ల గురక మొదలవుతుంది.
- గురక పెట్టడానికి పొగ తాగే అలవాటు కూడా కారణం అవుతుంది. కాబట్టి అనారోగ్యకరమైన ఈ అలవాటుకు దూరంగా ఉంటేనే మంచిది
-చాలామంది నిద్రపోయే ముందు ఓ పెగ్ వేస్తారు. ఆల్కహాల్ కారణంగా గొంతులోని కణాలు రిలాక్స్‌గా మారి.. నాలుక వెనక్కి వెళ్తుంది. ఫలితంగా గురక సమస్య మొదలవుతుంది
- నిద్రించే సమయంలో తలగడ ఉంచుకోవడం వల్ల కూడా గురక సమస్య కొంత వరకు తగ్గుతుంది. అయితే దిండు మరీ ఎత్తుగా లేదా మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి.
-రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు పాలలో రెండు చెంచాల పసుపు కలుపుకుని తాగడం వల్ల గురక సమస్య దూరం అవుతుంది.
- గోరు వెచ్చగా చేసిన వడగట్టిన నెయ్యిని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కల చొప్పున వేయడం వల్ల గురక తగ్గడంతోపాటు నిద్ర బాగా పడుతుంది. నెయ్యి బదులు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే బ్రాహ్మి తైలం కూడా వాడొచ్చు.
- రాత్రి నిద్రించే ముందు గ్లాసు వేడి నీటిలో అర టేబుల్ స్పూన్ యాలకుల గింజల పొడిని కలుపుకొని తాగడం వల్ల తప్పకుండా ఫలితం ఉంటుంది.
- గురకను నివారించుకునే మార్గాల్లో రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. గొంతు, నాలుక కండరాలు బలోపేతం చేసుకోవాలి. పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగడం, ప్రతి రోజు ఉదయం ఇరవై నిమిషాల పాటు యోగా చేయడం వంటి అలవాట్లు చేసుకుంటే గురక దూరమవుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…