అనారోగ్యాన్ని తొలగించి మానసిక ప్రశాంతతని ఇచ్చే అష్టాంగయోగా!

ఉరకల పరుగుల జీవితంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత చాలా అవసరం. అందుకోసం మనకోసం మనం కొంత సమయం కేటాయించుకోవాలి. అందులో భాగమే అష్టాంగయోగా. ఇందులో ఉండే 8 పద్ధతులు పాటిస్తేచాలు..ఎలాంటి అనారోగ్యం దరిచేరదు.

అష్టాంగయోగాలు

  1. యమము, 2. నియమము, 3. ఆసనము, 4. ప్రాణాయామము, 5. ప్రత్యాహారము, 6. ధారణ, 7. ద్యానము, 8. సమాధి

యమము
అహింస చేయకపోవడం, నిజం చెప్పడం, దొంగతనం చేయకపోవడం, బ్రహ్మచర్యం, దేని మీదా అతి మమకారం లేకపోవడం..ఈ 5 గుణాలను అలవరచుకుంటే మెదడు స్వచ్ఛంగా ఉంటుంది. కల్మషం లేనప్పుడు మనసు స్థిరంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

నియమము
యమముతో మనసు నిర్మలంగా ఉంటుంది. ఇక శరీరాన్ని శుద్ధి చేయడానికి తప్పని సరిగా ఆచరించాల్సిన ఆచారాలూ లేదా అలవాట్లు నియమ కిందికొస్తాయి.

ఆసనాలు
పతంజలి యోగ సూత్రాల్లో అతి ముఖ్యమైనవి ఆసనాలు. ఈ ఆధునిక యుగంలో వీటి అవసరం చాలా ఉంది. ఆరోగ్యంగా, దృఢంగా ఉంటే అందం దానంతట అదే వస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యాలకు ఆసనాలు చాలా అవసరం.

ప్రాణాయామం
శ్వాస దీర్ఘంగా తీసుకుని వదులుతూ మనసును లగ్నం చేయడమే ప్రాణాయామం. దీనివల్ల ఊపిరితిత్తులు బలపడతాయి. శ్వాసకోశ అనారోగ్యాలు దరి చేరవు. మనసులో అలజడులు ఉండవు. కేంద్రీకరణ శక్తి పెరుగుతుంది. ప్రాణాయామం ఎంత శ్రద్ధగా చేస్తే మెదడు అంత ప్రశాంతంగా ఉంటుంది.

ప్రత్యాహార
ప్రత్యాహారం అంటే వస్తువుల నుంచి ఇంద్రియాలను దూరం చేయడం లేదా నియంత్రించడం. ఇంద్రియాలు బాహ్య ప్రపంచానికి కిటికీలు. వస్తువుల నుంచి పొందే అనుభూతులతో మనసుకు ఆహారాన్ని ఇస్తాయి. ఇంద్రియ ప్రేరణలను మనసు వాటిని స్వీకరిస్తుంది. ఆ ప్రేరణలూ, ప్రతిస్పందనలతో అయోమయ స్థితిలో పడుతుంది. ప్రత్యాహారలో ఇంద్రియాలను ఎలా జయించాలో నేర్చుకోగలుగుతారు.

ధారణ
ఇంద్రియ నిగ్రహం సాధ్యమయ్యాక మెదడుకు ఏకాగ్రత, కేంద్రీకరణశక్తి, ధారణ పెరుగుతాయి. ఏకాగ్రత అనేది మెదడు శక్తిని ద్విగుణీకృతం చేస్తుంది. ఉన్నతాశయాల దిశగా సాగడంలో ధారణ సాయపడుతుంది.

ధ్యానం
ధ్యానం అంటే ఆలోచనల మీద అదుపు. అనేక అంశాల మీదికి దృష్టి మళ్లకుండా ఒక దానిమీద కేంద్రీకరించడం నేర్చుకోగలిగితే అతుకులు లేని ఆలోచనల ప్రవాహం సాధ్యమవుతుంది.

సమాధి
ఇక్కడ వస్తువూ ఆలోచనా ఒకటే. ఏకాగ్రత తర్వాతిదైన ఈ స్థితిలో శరీర మెలకువ స్థితి అంతర్థానమై మెదడు వస్తువుగా మారుతుంది. అది క్రమంగా ఉజ్జ్వల వెలుగుగా పరిణమిస్తుంది.

అష్టాంగ యోగావల్ల ఎన్నో లాభాలు
శారీరక బలం, మానసిక స్థైర్యం చేకూరుతుంది. కాళ్లూ చేతులూ మెడ, భుజాలూ తేలిగ్గా వంగుతాయి, కండరాలు దృఢంగా ఉంటాయి. హృదయ నాళాలు సవ్యంగా పని చేస్తాయి, ఒంట్లో కొవ్వు కరుగుతుంది, జీవక్రియ మెరుగుపడుతుంది, రక్తపోటు అదుపులో ఉంటుంది, ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. ఏకాగ్రత కుదురుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది. జీవన వైఖరే మారిపోతుంది, సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం