జరిగింది మహా ఘోరం – దానిపై రాజకీయాలు అంత కంటే పాపం !

ఒడిషాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 275 మంది చనిపోయారు. ఒకరిద్దరు చనిపోతేనే అయ్యో అనుకుంటాం.. అలాంటిది 275 మంది అంటే మాటలు కాదు. మహా విషాదం. అన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కనీసం వేయి మందికిపైగా గాయపడ్డారు. వారి జీవితాలూ తలకిందులు అయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే… స్థానిక ప్రజలు ఆస్పత్రులకు పోటెత్తారు. రక్తం అవసరం అయితే ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇచ్చారు. అది వారిలో మిగిలి ఉన్న మానవత్వం. కానీ ఈ ప్రమాదం నుంచి రాజకీయం చేస్తున్న వారు ఏం సాధిస్తున్నారు ?

శరవేగంగా స్పందించిన ప్రభుత్వాలు !

ప్రమాదం జరిగిపోయింది. దాన్ని ఎవరూ ఆపలేరు. ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది.. బాధ్యులెవరు అన్నది తర్వాత సంగతి. ఆ ప్రమాదంలో చనిపోయిన వారు.. గాయపడిన వారు.. వారి కుటుంబాల ఆవేదనను.. కనీస మాత్రంగా తీర్చే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాలు ఆ పని ప్రారంభించాయి. వీలైతే వారికి సాయం చేయాలి … లేకపోతే ఖాళీగా ఉండాలి కానీ.. సాయం చేసే వారిని వెనక్కి లాగేలా.. వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఎవరూ చేయకూడదు. దురదృష్టవశాత్తూ దేశంలోని రాజకీయ పార్టీలు.. విపక్షాలుగా చెప్పుకుంటూ అదే పని చేస్తున్నాయి.

ప్రభుత్వంపై విమర్శలు ఎప్పుడైనా చేయవచ్చు -కానీ మానవత్వం చూపక్కరలేదా ?

ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రతిపక్షాల హక్కు . ఎవరూ కాదనరు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అధికారపక్షం మీద పడిపోకూడదు. వారి పని వారిని చేయనివ్వాలి. కానీ దురదృష్టవశాత్తూ దేశంలోని ప్రతిపక్షాలు ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. మృతదేహాల గుట్టల్ని ఒకే వాహనంలో వేసుకుని తరలిస్తున్నట్లుగా.. వాటిని విసిరివేస్తున్నట్లుగా దృశ్యాలను వైరల్ చేస్తున్నారు. ఇలా వైరల్ అవుతున్న వీడియోల్లో అత్యధికం ఫేకే. వీటిని చూసి ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకోవాలని విపక్షాల లక్ష్యం. కానీ అది నైతికతేనా ?

ఏం చేసినా ప్రచారమేనని విమర్శలు మరో రాజకీయం !

ప్రభుత్వం వేగంగా స్పందించింది అన్ని చర్యలు తీసుకుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ .. సహాయ చర్యలు సమీక్షిస్తే.. ఆ ఫోటోలు మీడియాలో వస్తే అదీ ప్రచార ఆర్భాటమే అని విమర్శించేవారున్నారు. మోదీ ఫోన్ లో మాట్లాడుతున్న ఫోటోలను కూడా విమర్శించేవారే. ప్రమాదం మహా విషాదం.. కానీ బాధ్యతతో వ్యవహరించాల్సిన వారు తీరు అంత కంటే ఘోర విషాదం. ప్రజల ప్రాణాల్ని గాల్లో పెట్టేసి వికృత రాజకీయం చేస్తున్న వారి తీరుపై ప్రజలు ఆలోచించాల్సిందే !