ఒడిశా రైలు ప్రమాదం అనేక ప్రశ్నలను ఆవిష్కరించిన మాట వాస్తవం. దాదాపు 300 ప్రాణాలు గాల్లో కలిసిపోయిన విషాదమది. కేంద్రప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రల వైద్యానికి సాయం ప్రకటించింది. మరమ్మతు చేసిన ట్రాక్ పై తొలి రైలు పరుగులు తీయడం కూడా తక్కువ టైమ్ లో జరిగిన పనే..
గతంలోనూ భారీ మరణాలు
ప్రస్తుత బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, పశ్చిమ బంగ సిట్టింగ్ సీఎం మమతా బెనర్జీ కూడా రైల్వే మంత్రులుగా చేశారు. వారి కాలంలో భారీ ప్రమాదాలు జరిగాయి. ప్రస్తుత ప్రమాదంతో పోల్చితే ప్రాణనష్టం కూడా ఎక్కువే. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో నితీశ్ కుమార్ రెండు పర్యాయాలు రైల్వే మంత్రిగా చేశారు. ఆ టైమ్ లో రైళ్లు ఢీకొనడాలు, పట్టాలు తప్పడాలు లాంటి 1,079 యాక్సిడెంట్స్ నమోదయ్యాయి. 1,527 ప్రాణాలు పోయాయి. రైల్వేలకు భారీ నష్టం సంభవించింది.
వారిద్దరి టైమ్ లో కూడా…
మమతా ముఖ్యమంత్రి కాకముందు రెండు పర్యాయాలు రైల్వే మంత్రిగా ఉండేవారు. వాజ్ పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లో రైల్వే మంత్రిగా ఆమె పనిచేసినప్పుడు 893 ప్రమాదాలు జరిగాయి. 1,451 మంది ప్రాణాలు వదిలారు. లాలూ మంత్రిత్వంలోనూ 601 ప్రమాదాల్లో 1,150 మరణాలు సంభవించాయి. నిజానికి నితీశ్ కుమార్ మంత్రిగా ఉన్నప్పుడే అత్యధిక రైలు ప్రమాదాలు నమోదయ్యాయి. వెయ్యి సార్లు రైళ్లు పట్టాలు తప్పాయి. రెండు రైళ్లు ఢీకొన్న సంఘటనలు 79 సార్లు జరిగాయి. మమత పాలనలో రైలు పట్టాలు తప్పిన సంఘటనలు 839. నితీశ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు గైసల్ లో జరిగిన ప్రమాదంలో 285 ప్రాణాలు పోయాయి. అప్పుడే నితీశ్ రాజీనామా చేశారు.
సవాలుగా తీసుకుని శ్రమిస్తున్న వైష్ణవ్…
గతంలో ఎప్పుడు రైలు ప్రమాదాలు జరిగినా మంత్రి వచ్చి కాసేపు నిల్చుని మీడియా ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయేవారు. ప్రస్తుత మంత్రి అశ్విన్ వైష్ణవ్ అలా కాదు. ప్రమాదం జరిగినప్పటి నుంచి అహరహం అక్కడే ఉంటూ సహాయ, మరమ్మత్తు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. గత రెండు దశాబ్దాల్లో రైల్వే శాఖకు ఇది పెద్ద సవాలు అని గ్రహించిన ఆయన దానికి తగ్గట్టుగా అధికారులను మోటివేట్ చేస్తూ పనుల వేగాన్ని పెంచారు. వైద్య శాఖ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగాలను సమన్వయం చేసుకుంటూ సత్వర చర్యలు చేపట్టారు. బాలాసోర్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అనుభవంతో అక్కడి పరిస్థితులు బాగా తెలిసిన వైష్ణవ్ .. త్వరగా స్పందిస్తూ పనులు కానిచ్చేస్తున్నారు. అందుకే విపక్షాలు కోరినట్లుగా ఆయన రాజీనామా చేయాల్సిన పని లేదు. ప్రమాదాలు చెప్పి రావు అన్న సంగతి ఎవరూ మరిచిపోకూడదు. మరో పక్క తాజా దుర్ఘటన విషయంలో కవచ్ విధానం పనిచేసే అవకాశం లేదని తేల్చారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్లోకి ప్రవేశించిన తర్వాత గూడ్స్ ట్రైన్ కు దానికి కేవలం వంద మీటర్ల దూరమే ఉంది. కవచ్ ను యాక్టివేట్ చేయాలంటే తక్కువలో తక్కువగా 600 మీటర్ల ఎడం ఉండాలి. ఈ సంగతులు తెలియకుండానే విపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయన్నది నిజం