బాలాసోర్ రైలు ప్రమాద విషాదాన్ని ఇప్పట్లో మరిచిపోయే అవకాశాలు లేవు. చనిపోయిన దాదాపు 300 మంది కుటుంబాలు తీవ్ర ఆవేదన, ఆందోళనలో మునిగిపోయిన వేళ ప్రమాదానికి అసలు కారణాలపై విశ్లేషణకు కొంచెం సమయం తీసుకుంటోంది. చెల్లాచెదురైన రెండు రైళ్లు, ఒక గూడ్స్ బోగీల మధ్య నుంచి మృతుల పార్థివ దేహాలను, క్షతగాత్రులను బయటకు తీసేందుకు సహాయ బృందాలు నానా తంటాలు పడ్డాయి. యుద్ధ ప్రాతిపదికన జరిగిన రెండు రోజుల పనుల్లో గుండె కదిలిపోయే అనేక దృశ్యాలు కనిపించాయి..
రైలు సిగ్నల్ కాదు.. సెల్ ఫోన్ సిగ్నల్
సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని ఒక వాదన. సిగ్నల్ పడి వెంటనే ఆగిపోవడంతో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్లోకి వచ్చిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. బాధితులను గుర్తించడం, గాయపడిన వారు ఎక్కడ పడున్నారో తెలుసుకోవడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ బాగా ఉపయోగపడ్డాయని సహాయ సిబ్బంది చెబుతున్నారు. సెల్ ఫోన్ రింగ్ టోన్స్ ఆధారంగా తమ వారిని గుర్తించామని బాధిత బంధువులు వెల్లడించారు..
మూగబోయిన ఫోన్స్
రెండు రైళ్లలో ప్రయాణించిన ఆంధ్రప్రదేశ్ ప్రయాణికుల్లో దాదాపు 150 మంది సెల్ ఫోన్స్ మూగబోయాయి. వాటి సిగ్నల్స్ కూడా అందడం లేదు. రైలు ప్రమాదంలో నుజ్జునుజ్జయి ఎక్కడో పడిపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. మరో పక్క కొన్ని సెల్ ఫోన్స్ రింగ్ కావడం బాధితుల బంధువులకు ఊరటనిచ్చింది. చనిపోయిన వారి సెల్ ఫోన్స్ కూడా మార్చురీ దగ్గర ఇతరుల కోసం వేచి ఉన్నవారు భద్రపరిచారు. అవి రింగ్ అయినే పూర్తిగా విషయం చెప్పడంతో బంధువుల వెళ్లి లాంఛనాలు పూర్తి చేసి శవాలను స్వాధీనం చేసుకునే అవకాశం కలిగింది.
ఆగకుండా మోగుతూనే
ప్రమాదం జరిగిన వెంటనే కొన్ని ఫోన్స్ నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. వాటి ఓనర్ల పరిస్థితి దయనీయంగా ఉండటంతో ఫోన్ కాల్స్ కు స్పందించలేకపోయారు. ప్రమాద వార్తలను టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో చూసిన వాళ్లు మాత్రం ఫోన్లు చేస్తూ టెన్షన్ పడుతూనే ఉన్నారు..
లవ్ లెటర్లు, బొమ్మలు
బాలోసోర్ జిల్లా బహనాగా స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి బోగీలు ఎగిరి పడటంతో ఆ దెబ్బకు రైల్లోని సామాన్లు చెల్లాచెదురుగా పడ్డాయి. సూట్ కేసులు పగిలిపోయి, బ్యాగులు చనిగిపోయి సామాన్లు చిందరవందరగా పడిపోయాయి. సహాయ సిబ్బంది వెదికే క్రమంలో కొన్ని ఆసక్తికరమైన వస్తువులు కూడా దొరికాయి. బెంగాలీలో రాసి ఉన్న కొన్ని ప్రేమలేఖలు కూడా ట్రాక్ మీద పడున్నాయి. చిన్న మేఘాలు వర్షిస్తాయి, చిన్న ప్రేమలు చిగురిస్తాయని అర్థం వచ్చేలా బెంగాలీ ప్రేమకావ్యాలు ఆ నోటు బుక్కులో రాసుకున్నారు. రచయిత ఎవరో తెలీదు, ఎవరని ఉద్దేశించి రాశారో అర్థం కాలేదు. పుస్తకంలో చాలా భాగాలు చనిగిపోయిన గాలికి కొట్టుకుపోయాయి. దొరికిన ఒకటి రెండు పేజీల్లో ఉన్న కవితలు మాత్రం ఆ బెంగాలీ కవి హృదయ స్పందనను ప్రతిబింబించాయి.
చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా రైలు ప్రమాద స్థలంలో దొరికాయి. వాటిని చూసిన తర్వాత ఒకరిద్దరూ సహాయ సిబ్బంది కంట తడి పెట్టుకున్న మాట కూడా వాస్తవం. కాకపోతే ఆ బొమ్మలకు సొంతదారులైన పిల్లలు ఎక్కడున్నారో ఇప్పుడే చెప్పలేం…