సిద్దా మాటలేనా.. చేతలు కూడా ఉంటాయా.. ? – బీజేపీ ప్రశ్నలు

ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రివాజుగా మారింది. గెలిచినప్పుడు చూసుకుందాములే అన్నట్లుగా కాంగ్రెస్ హామీలుంటాయి. పొరబాటును గెలిస్తే మాత్రం ఉచితాల అమలులో వీలైనంత జాప్యం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతుందని తాజా పరిణామాలే చెబుతున్నాయి. అధికారం చేపట్టిన రోజే ఉచితాల ఫైళ్లపై సంతకం చేసేంతగా ప్రచారం చేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు అందుకు భిన్నంగా జాప్యానికి ప్రాధాన్యమిస్తోంది. ఐదు ఉచితాలను అమలు చేసేందుకు మూడు నెలల గడువు అడుగుతోంది. అదేమంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే అన్ని స్కీములు పట్టాలెక్కుతాయని చెబుతూ తప్పించుకునే ప్రయత్నంలో ఉంది.

రూ. 61 వేల కోట్లు అవసరం

ఆర్థిక మంత్రిగా సిద్దరామయ్య త్వరలో తన 14వ బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్నారు. హామీ ఇచ్చిన ఐదు ఉచిత స్కీములకు రూ.53 వేల నుంచి రూ.61 వేల కోట్లు ఖర్చవుతుందని ఆర్థిక రంగ నిపుణులు నిగ్గు తేల్చారు. గృహ లక్ష్మీ పథకానికి రూ. 30 వేల కోట్లు, గృహజ్యోతి స్కీముకు రూ.15వేల కోట్లు, అన్న భాగ్య పథకానికి రూ. వెయ్యి కోట్లు, శక్తి స్కీములు రూ. 4 వేల కోట్లు, యువ నిధి స్కీముకు రూ. 2 వేల కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. అది కనిష్టం మాత్రమే. గరిష్టంగా ప్రతీ స్కీముకు మరో పది శాతం వ్యయం కలుపుకుపోవాల్సి ఉంటుంది.

అమలు కార్యాచరణపై స్పష్టత లేదన్న బీజేపీ

సిద్దరామయ్య నేతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ కర్ణాటక శాఖాధ్యక్షుడు నళిన్ కుమార్ కాటిల్ మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా, ఎన్నికల హామీలు అమలు చేసేందుకు సమకూరే ఆదాయంపైనా శ్వేతపత్రం సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పథకాల అమలు తీరుతెన్నులపై ప్రజలకు కూడా వివరణ ఇవ్వాల్సిన అనివార్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని నళిన్ కుమార్ అంటున్నారు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు పది కిలోల బియ్యం ఇస్తామన్న హామీ బాగానే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఇస్తున్న ఐదు కిలోలతో కలిపి పంపిణీ చేస్తారా, లేక అదనంగా పది కిలోలు పంపిణీ చేస్తారా అని బీజేపీ ప్రశ్నిస్తోంది.

స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఆశలు

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో గెలిచేందుకు ఖచితంగా హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాకపోతే అందుకు కావాల్సిన నిధులు ఎక్కడ నుంచి తెస్తారంటే మాత్రం సమాధానం లేదు. సిద్దరామయ్యను అడిగితే లెక్క చూసుకుని తర్వాత చెబుుతానని సమాధానమిస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ తాజాగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పాత స్కీములను అటకెక్కించి.. వాటి నుంచి పొదుపు చేసిన నిధులను ఆ ఐదు స్కీములకు కేటాయిస్తారని బీజేపీ అంటోంది. మరి దానికి కాంగ్రెస్ సమాధానం ఏమిటో…