జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ఎట్టకేలకు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన గతంలో ప్రకటించినట్లుగా తిరుపతి నుంచి కాకుండా అన్నవరం నుంచి యాత్ర ప్రారంభించి ఉభయగోదావరి జిల్లాలలోనే మొదటి విడత యాత్ర చేయాలనుకోవడంతో అసలు రూట్ మ్యాప్ ఎందుకు మారిందన్న చర్చ ప్రారంభమయింది.
రాయలసీమలో నారా లోకేష్ పాదయాత్ర
టీడీపీ యువ నేత నారా లోకేష్ రాయలసీమలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం కడప జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. సీమలోని మూడు జిల్లాల్లో లోకేష్ యాత్ర పూర్తయింది. ఈ కారణంగానే తిరుపతి నుంచి వారాహి యాత్ర ప్రారంభించాలని భావించినా.. ఆలోచన మార్చుకున్నారని అంటున్నారు. లోకేష్ పాదయాత్రపై ఫోకస్ తగ్గకుండాచేయడానికే సెంటిమెంట్ ను కూడా కాదని భీమవరం అంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. పొత్తులు ఖాయమని ఇప్పటికే పవన్ స్పష్టం చేసినందున పోటీ చేసే అన్ని నియోజకవర్గాల్లోనూ గెలవాలని అనుకుంటున్నారు. బలం ఉన్న చోట్ల ఖచ్చితంగా పోటీ చేస్తామని.. పవన్ చెబుతున్నారు. బలం ఉందని భావిస్తున్న గోదావరి జిల్లాల్లోనే మొదట పవన్ రంగంలోకి దిగుతున్నట్లుగా బావిస్తున్నారు.
యాత్ర రాష్ట్రమంతటా జరగడం డౌటే !
గోదావరి జిల్లాల్లో యాత్ర ఎన్ని రోజులు ఉంటుందనేది ఇప్పటికీ స్పష్టత లేదు. ఎక్కువ సమయం ప్రజలతో గడుపుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. రోజుకో నియోజకవర్గం చొప్పున పర్యటన చేసినా దాదాపు 40 రోజులు గోదావరి జిల్లాలకు కేటాయించాల్సి ఉంటుంది. ఎన్నికలయ్యే వరకూ ప్రజల్లోనే ఉంటారా అన్నది కూడా డౌటే. పవన్ కు చాలా టైట్ షెడ్యూల్స్ ఉన్నాయి. నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి. రోజుకు రెండు కోట్లు వస్తాయని ఆయన చెబుతున్నారు. అందుకే రాష్ట్రమంతటా తిరగడం డౌటేనని అంటున్నారు.
బలమైన నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు వారాహిని రోడ్డు మీదకు తెస్తున్నారు. పధ్నాలుగో తేదీ నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతుంది. మొదట తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో యాత్ర సాగుతుంది. తిరుపతి నుంచి వారాహి యాత్ర ప్రారంభం అవుతుందని గతంలో జనసేన ప్రకటన చేసింది. ఇప్పుడు రూటు మారింది. అన్నవరం నుంచి ప్రారంభానికి నిర్ణయించారు. పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాలపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అక్కడి సామాజిక సమీకరణాలు తనకు కలిసి వస్తాయనే అంచనాలతో ఉన్నారు. బీజేపీ కలిసొచ్చినా, లేకున్నా టీడీపీ..జనసేన పొత్తు ఖాయమని చెబుతున్నారు.