ఏపీకి బీజేపీ అగ్రనేతలు – విశాఖ, తిరుపతిల్లో బహిరంగసభలు !

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ విజయాలను నలుదిశగా ప్రచారం చేసేందుకు శ్రమిస్తున్న ఏపీ బీజేపీ నేతలకు అగ్రనేతలు కూడా ఉత్సాహం అందిస్తున్నారు. అత్యంత బిజీ షెడ్యూల్ లోనూ ఏపీలో బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖలో అమిత్ షా , తిరుపతిలో జేపీ నడ్డా బహిరంగసభలు పెట్టనున్నారు. ఇందు కోసం తేదీలను కూడా ఖరారు చేసారు.

ఇప్పటికే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ

ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో గత నెల 30 వతేదీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనను ఇంటింటికి తీసుకెళ్లే ప్రచారం ప్రారంభమయింది. జిల్లాల వారీగా బహింగసభలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో రెండు జిల్లాల బహిరంగసభలకు పార్టీ అగ్రనాయకత్వం వస్తూండటంతో.. బీజేపీలో ఉత్సాహం కనిపిస్తోంది. ఎనిమిదో తేదీన విశాఖ, పదో తేదీన జేపీ నడ్డా బహిరంగసభను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

విశాఖలో భారీ జన సమీకరణ చేయనున్న బీజేపీ నేతలు

విశాఖలో మోదీ ప్రభుత్వం సాధించిన తొమ్మిదేళ్ల విజయాలపై బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీపై దృష్టి పెట్టాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించుకున్నారని అందుకే ఇద్దరు అగ్రనేతలు మూడు రోజులగా ఏపీలో పర్యటిస్తున్నారని భావిస్తున్నారు. ఎన్నికలు ముంచుకు వస్తున్న సమయంలో బీజేపీతో పొత్తుల కోసం రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. పొత్తుల విషయంలో హైకమాండ్ దే తుది నిర్ణయమని.. వారు ఏం చెబితే దాన్ని పాటిస్తామని రాష్ట్ర నేతలు అంటున్నారు. ఇప్పటికే తాము జనసేనతో మాత్రమే ఉన్నామంటున్నారు. ఈ విషయంలో అగ్రనేతలు ఏమైనా సంకేతాలిస్తారేమో చూడాల్సిఉంది.

బీజేపీ బలోపేతం కోసం నేతల తీవ్ర ప్రయ.త్నాలు

ఏపీ బీజేపీ నేతలు పార్టీని బలోపేతం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. హైకమాండ్ నిర్దేశించిన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారు. గతంలో ఆరేడు వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించిన బీజేపీ.. ఇటీవల ప్రజా చార్జిషీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వ విజయాలను కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి 9 ఏళ్లయిన సందర్భంగా నవ వసంతాలు – నవ కుసుమాల పేరిట తొమ్మిది విజయాలను భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు.